గొడుగులతో దుర్గామాత వేడుకల్లో పాల్గొన
కోల్ కతా వాసులు
పశ్చిమబెంగాల్ లో శనివారం
మహాసప్తమి వేడుకల్ని భక్తులు సంబరంగా జరుపుకున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా
కోలకతాలో భక్తులు పెద్ద సంఖ్యలో గొడుగులు వేసుకుని మరీ వేడుకల్లో పాల్గొన్నారు. రుతుపవనాలు
ఇంకా తిరోగమనం ప్రారంభించకపోవడంతో, పశ్చిమ బెంగాల్లో దుర్గా
పూజా ఉత్సవాలపై ఉరుములతో కూడిన వర్షాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ వర్షాలు
దశమి రోజున కూడా కురవొచ్చని వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈశాన్య జార్ఖండ్
మీదుగా ఒక తుపాను, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలలో మరో తుపాను విరుచుకు పడొచ్చని
తెలిపింది. దీనివల్ల పశ్చిమ బెంగాల్లో
ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు
ప్రకటించాయి. ఇంకా నాలుగ్రోజుల పాటు జరుగనున్న దుర్గా మాత పూజలపై వర్షాల ప్రభావం
పడొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ రోజు మహాసప్తమి సందర్భంగా ఓ వైపు జోరుగా వాన కురుస్తున్నా
భక్తులు యథావిధిగా పూజలకు హాజరుకావడం విశేషం.