Friday, September 20, 2019

Motor cyclist dies after being hit by train


రైలు ఢీకొని బైకర్ దుర్మరణం
కోల్ కతాలో మోటారు బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రైలు ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు ఆగ్నేయ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. కోల్ కతా నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ చక్రాల కింద బైక్ నలిగిపోగా బైకర్ అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. కోల్ కతా నుంచి రైలు బయలుదేరి 9 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సత్రాగచి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ ను ఆనుకుని నియంత్రణదారు లేని చోట కాలిబాట మార్గంలో బైకర్ రైలు వస్తున్నా దాటేయొచ్చనే తలంపుతో బైక్ ను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11.45 సమయంలో రైలు దూసుకువస్తుండగా బైకర్ వాహనంతో సహా దాని చక్రాల కింద చిక్కుకుపోయి దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Thursday, September 19, 2019

NDRF set to induct women personnel


వచ్చే ఏడాది నాటికి ఎన్డీఆర్ఎఫ్ లోకి మహిళలు
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) లోకి మహిళల ప్రవేశం షురూ కానుంది. వచ్చే ఏడాది నాటికి కొత్తగా ఏర్పాటుకానున్న నాలుగు బెటాలియన్లలో మహిళల్ని చేర్చుకోనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఐపీఎస్ ఎస్.ఎన్.ప్రధాన్ ప్రకటించారు. 2018 నుంచి మహిళా సభ్యుల్ని చేర్చుకోవాలనే యోచన ఊపందుకుందన్నారు. పశ్చిమబెంగాల్ లోని హరింఘాటలో గల ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్ లో రెండో బెటాలియన్ ను ప్రధాన్ ఇటీవల ప్రారంభించారు. ప్రధానంగా సౌకర్యాల లేమీ వల్లే గతంలో మహిళా సిబ్బందిని చేర్చుకోలేకపోయామన్నారు. కొన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అన్ని మౌలికసదుపాయాల్ని కల్పించగల స్థితిలోకి వచ్చిందని అందుకే ఇప్పుడున్న 12 బెటాలియన్లకు అదనంగా మరో నాలుగు కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ఈ కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కొత్త బెటాలియన్లకు మహిళా సిబ్బందిని పంపాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఇతర సాయుధ దళాల్ని ఎన్డీఆర్ఎఫ్ కోరుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఒక్కో బెటాలియన్ లో 1,150 మంది సిబ్బంది ఉంటారు. కొత్త సిబ్బందిని చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వం అసోం రైఫిల్స్, ది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటుకు 2005లో బీజం పడింది. ఇందుకుగాను ప్రకృతి విపత్తుల నిరోధక కార్యనిర్వహణ చట్టం చేశారు. 2006లో న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటయింది. బాధితుల సంరక్షణ, వెన్నుదన్నుగా నిలవడం అనే ప్రధాన ధ్యేయంతో ఎన్డీఆర్ఎఫ్ పని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు, భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ నాటి నుంచి ఇతోధిక సేవలందిస్తోంది.

Wednesday, September 18, 2019

Ghulam Nabi Azad, Ahmed Patel meet Chidambaram in Tihar jail


చిదంబరాన్ని తీహార్ జైలుకు వెళ్లి కలిసిన గులాంనబీ, అహ్మద్ పటేల్
తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, చిదంబరం తనయుడు కార్తీలు కలిశారు. ఐ.ఎన్.ఎక్స్. మీడియా ముడుపుల కేసులో చిదంబరం అరెస్టయి సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. సోమవారమే చిదంబరం 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. చిదంబరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని జైలు ప్రధాన ఆవరణలో ఆయనను కలిసినట్లు గులాంనబీ తెలిపారు. అర్ధగంట సేపు చిదంబరంతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ లు తాజా రాజకీయ పరిణామాల్ని ఆయనతో చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, రానున్న ఆయా రాష్ట్రాల ఎన్నికలు, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిమాణాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల త్రయం చర్చించినట్లు తెలుస్తోంది.


Tuesday, September 17, 2019

Air-To- Air Missile Astra succesfully test fires in the odisha coast


అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాల్ని ఛేదించే అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతంపై సుఖోయ్-30 ఎం.కె.ఐ. యుద్ధ విమానం నుంచి మంగళవారం ఈ పరీక్షను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. నిరంతరం నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఈరోజు అస్త్రా క్షిపణి ప్రయోగాన్ని చేపట్టారు. వివిధ రాడార్లు, ఎలక్ట్రో ట్రాకింగ్ వ్యవస్థ, సెన్సార్ల నుంచి అందిన సమాచారం ప్రకారం అస్త్రా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్లు భారత సైనికాధికారులు ధ్రువీకరించారు. అవసరాలకు అనుగుణంగా అస్త్రాను ప్రయోగించొచ్చన్నారు. మధ్యంతర, సుదీర్ఘ శ్రేణిలోని లక్ష్యాల్ని ఈ క్షిపణి ఛేదించగలదని పేర్కొన్నారు.