లాంచీ మునిగిన కచ్చులూరు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి లాంచీ మునక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్
రెడ్డి సోమవారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు. దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన
లాంచీ దుర్ఘటన లో 12 మంది మృతదేహాల్ని వెలికితీశారు. ఆదివారం 8, సోమవారం మరో నాలుగు
మృతదేహాల్ని వెలికితీసి రాజమండ్రి ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స
అందిస్తున్నారు. మునిగిపోయిన లాంచీ, అందులో చిక్కుకుపోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్,
ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు దుర్ఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో 34 మంది గల్లంతైనట్లు
భావిస్తున్నారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
దుర్ఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం జగన్ వెంట ఏపీ హోంమంత్రి సుచరిత, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్
యాదవ్, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం జగన్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని
ప్రమాద బాధితులను పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారుల్నిఅడిగి తెలుసుకున్నారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి యోగ క్షేమాలు కనుక్కున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి సీఎం
జగన్ వైద్యుల్ని ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఆదివారమే
రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తెలంగాణ సీఎం కె.సి.ఆర్. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.