భువనేశ్వర్ లో వాహనచోదకులకు ఉచితంగా
శిరస్త్రాణాలు
భువనేశ్వర్ పరిసరాల్లోని కొత్త మోటారు వాహనాల చట్టంపై పోలీసులు మంగళవారం
అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులకు ఇక్కడ
పోలీసులు జరిమానాలకు బదులు ఫ్రీగా హెల్మెట్లు
అందిస్తున్నారు. స్థానిక కల్పనా స్క్వేర్ లో మంగళవారం ఈ కార్యక్రమంలో స్వయంగా
పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంట నగరమైన కటక్ లోనూ పోలీసుశాఖ ఈ స్పెషల్ డ్రైవ్
కు శ్రీకారం చుట్టింది. కొత్త మోటారు వాహనాల చట్టం-2019 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరువాత
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించడంపై ముఖ్యమంత్రి నవీన్
పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిబంధనల్ని మరో మూణ్నెల్లు దూకుడుగా
అమలు చేయొద్దని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీస్ శాఖ ఇప్పుడు రోడ్లపై
విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. `ఎం.వి. చట్టం ఆదాయాన్ని సృష్టించే వ్యాపారం
కాదు. ప్రజల భద్రతే మా లక్ష్యం` అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సాగరికా
నాథ్ అన్నారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పోలీసు సిబ్బంది ఉచితంగా
శిరస్త్రాణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ముందు ఉల్లంఘనదారుల నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి వారికి చలాన్ తో పాటు ఫ్రీగా హెల్మెట్
అందిస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీక్ ఆన్ మొబైల్ విత్ డ్రైవింగ్,
రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, విత్ అవుట్ హెల్మెట్, సీట్ బెల్ట్
డ్రైవింగ్, విత్ అవుట్ నెస్సెసరీ డాక్యుమెంట్స్ డ్రైవింగ్ చేయొద్దని వాహనచోదకుల్ని
పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు
తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తున్న వాహనచోదకులకు గులాబీలు చేతికిచ్చి పోలీసులు అభినందించారు.
బిహార్ లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే..
బీహార్ లోనూ పోలీస్ శాఖ ట్రాఫిక్ నిబంధనలు
ఉల్లంఘించిన వాహనచోదకులతో వినూత్న రీతిలో స్పందిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. మంగళవారం
తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహరి పట్టణంలో శిరస్త్రాణం ధరించని బైకర్లను
పట్టుకుని దగ్గరుండి వారితో కొనిపించడం కనిపించింది. బీమా పునరుద్ధరణ చేయించని
వారితోనూ అక్కడికక్కడే కార్యక్రమం పూర్తి చేయించింది. ఇందుకు శిరస్త్రాణం అమ్మకందారులు, బీమా పాలసీ
ఏజెంట్ల తో ఆయా తనిఖీ కూడళ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక
కార్యక్రమాన్ని మోతీహరిలో ఛటౌని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ముఖేష్ చంద్ర కున్వర్
ప్రారంభించారు. ఉల్లంఘనదారులకు పోలీసులు జరిమానాలు విధించకపోవడం విశేషం. 1917 లో మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని
ప్రారంభించిన మోతీహారి చారిత్రక ప్రాముఖ్యత తనకు ప్రేరణనిచ్చిందని ముఖేష్ చంద్ర
కున్వర్ పేర్కొన్నారు.