అరుణ్ జైట్లీ అస్తమయం: పలువురు నాయకుల నివాళి
భారతీయ జనతా పార్టీ
సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.30 కు తుదిశ్వాస
విడిచారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని
మోది, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం
తెలిపారు. అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియగానే ఆయన స్వగృహానికి చేరుకున్న రాష్ట్రపతి
దివంగత నేతకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడు తమిళనాడు పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. హోంమంత్రి
అమిత్ షా సమాచారం అందిన వెంటనే అరుణ్ జైట్లీ నివాసానికి చేరుకుని ఆయన
భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ
పార్టీల నాయకులు అరుణ్ జైట్లీ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.
ఆగస్ట్ 9న ఆయన అస్వస్థకు గురై ఎయిమ్స్ లో చేరారు. అరుదైన కేన్సర్ తో
బాధపడుతున్న అరుణ్ జైట్లీ రెండు వారాల చికిత్స అనంతరం కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి
లోనూ ఆయన అమెరికా వెళ్లి కొంతకాలం చికిత్స పొందారు. వాజ్ పేయి ప్రభుత్వంలో
న్యాయశాఖ, సమాచార ప్రసారశాఖల్ని నిర్వహించారు. స్వతహాగా న్యాయవాది అయిన ఆయన
సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల్లో కేసులు వాదించారు. అరుణ్ జైట్లీ పాత్రికేయులతో
సత్సంబంధాలు నెరపిన నేత. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన అడిషినల్
సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు వహించారు. ప్రధాని మోదితో ఆయనకు మూడు దశాబ్దాల
అనుబంధముంది. మోది తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఆయన కేబినెట్ లో రక్షణ,
ఆర్థిక శాఖల్ని చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో అరుణ్ జైట్లీ తరఫున పీయూష్ గోయల్
బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ మరణించిన నెలలోనే మరో సీనియర్
నాయకుడు అరుణ్ జైట్లీ మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటు. ఆయన అంత్యక్రియల్ని ఆదివారం
ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో నిర్వహించనున్నారు.