Thursday, July 25, 2019

Nalini released from vellore prison on parole


వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలైన నళిని
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన నళిని గురువారం వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలయింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు నిర్వహించుకునేందుకు ఆమెకు నెలరోజుల పెరోల్ లభించింది. ఈ మేరకు నళిని జులై5న అభ్యర్థించింది. మన్నించిన మద్రాస్ హైకోర్టు 30 రోజుల సాధారణ సెలవు మంజూరు చేసింది. నళినిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు నుంచి ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. వెల్లూర్ సాతువాచారి గ్రామం నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో రంగాపురం తరలించారు. నళిని కూతురు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కలవరాదు..మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనే షరతుపై నళినికి పెరోల్ మంజూరయింది. అయితే ఆమె తన కూతురు పెళ్లి ఏర్పాట్లకుగాను ఆరు నెలలపాటు పెరోల్ కోరింది. ప్రభుత్వం కేవలం నెల రోజులు మాత్రమే సాధారణ సెలవులు ఇవ్వగలమని తేల్చి చెప్పింది. 30 రోజుల సమయం పెళ్లి ఏర్పాట్లు చేయడానికి ఏమాత్రం సరిపోదని నళిని వాదించినా ఫలితం లేకపోయింది. నళిని, మురగన్ (జీవిత ఖైదీ) లు జీవితఖైదు అనుభవిస్తుండగా వెల్లూర్ జైలులోనే కూతురు జన్మించింది. 28 ఏళ్లగా తామిద్దరం జైలులోనే గడుపుతున్నామని తల్లిదండ్రులుగా తమ కూతురు ఆలానాపాలనకు కూడా నోచుకోలేకపోయామని నళిని ఆవేదన వ్యక్తం చేసింది.

Wednesday, July 24, 2019

BJP MLA demands resignation of Karnataka legislative assembly speaker following fall of coalition government


కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కర్ణాటక విధానసభ స్పీకర్ కె.రమేశ్ కుమార్ (కాంగ్రెస్) రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రేణుకాచార్య బుధవారం డిమాండ్ చేశారు. కుమారస్వామి ప్రభుత్వ పతనంతో రాష్ట్ర ప్రజల అభీష్టం నెరవేరిందని వారి ఆకాంక్షల ప్రకారం బీజేపీ పాలన కొనసాగుతుందని రేణుకాచార్య పేర్కొన్నారు.  కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం విశ్వాస తీర్మానం వీగి పోవడంతో 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. 
కుమారస్వామికి రెండో సారి ముఖ్యమంత్రి పదవి అర్ధాంతరంగా పోయింది. తొలుత 2006 ఫిబ్రవరి 3 నుంచి 2007 అక్టోబర్ 9 వరకు సీఎంగా ఆయన బీజేపీ తో కూడిన జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ కు సారథ్యం వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మళ్లీ దశాబ్దం తర్వాత రెండోసారి 2018లో ఊహించని వరంలా కాంగ్రెస్ తో జట్టుకట్టి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. 23 మే 2018 నుంచి ఆయన 23 జులై 2019 వరకు సీఎంగా పదవిలో ఉన్నారు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జనతాదళ్(ఎస్) ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శాసనసభ్యత్వాలకు రాజీనామా సమర్పించడంతో రగడ మొదలైంది. తాజాగా శాసనసభలో బలం నిరూపించుకోలేక ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమారస్వామి తండ్రి మాజీ ప్రధాని దేెవెగౌడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వల్పకాలమే పనిచేశారు. కేంద్రంలో నాడు సంకీర్ణ కూటమికి ప్రధానిగా ఆయన నేతృత్వం వహించాల్సి రావడంతో కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు. 1994 డిసెంబర్ నుంచి 1996 మే వరకు ఆయన రాష్ట్ర సారథ్య బాధ్యతలు వహించారు.

Tuesday, July 23, 2019

UP revenue official suspended for 'calling names' to PM


ప్రధాని మోదీని తిట్టి సస్పెండయిన యూపీ రెవెన్యూ అధికారి
ప్రధానమంత్రి మోదీని దుర్భాషలాడిన ఉత్తరప్రదేశ్ రెవెన్యూ అధికారి ఒకరిపై సస్పెన్షన్ వేటుపడింది. కిసాన్ సమ్మాన్ నిధి పింఛను ఇప్పించాలని కోరిన ఓ రైతుపై సదరు అధికారి బూతులతో రెచ్చిపోయాడు. అక్కడితో ఆగకుండా దేశ ప్రధాని మోదీ పైన తిట్ల దండకం అందుకున్నాడు. ఇదంతా పక్కన ఎవరో మొబైల్ లో వీడియో రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారమంతా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. కోర్టు మెట్లు ఎక్కింది. విచారణ నిర్వహించిన బద్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ దినేశ్ కుమార్ సాక్ష్యాధారాల్ని పరిశీలించిన మీదట మంగళవారం సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. 
లేఖ్ పాల్ సింగ్ అనే రైతు పింఛన్ అందడం లేదని రెవెన్యూ అధికారి శివ సింగ్ వద్దకు వచ్చాడు. తనకిచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి పింఛన్ ధ్రువపత్రంలో తప్పులున్న విషయం ఆయన దృష్టికి తెచ్చాడు. అందువల్లే తనకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి సరిచేయాలని కోరాడు. అందుకు ఆ అధికారి సహకరించకపోగా తాత్సారం చేస్తున్నాడు. విసిగిపోయిన రైతు లేఖ్ పాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇస్తానని రెవెన్యూ అధికారిని హెచ్చరించాడు. దాంతో శివాలెత్తిన అధికారి శివ సింగ్ ఆ రైతుపై బూతుపంచాగం విప్పాడు. ఆ కోపోద్రేకంలో ప్రధాని మోదీని దుర్భాషలాడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు.


Monday, July 22, 2019

`Train 18` trial run from delhi to katra conducted successfully


ఢిల్లీ-కత్రా మధ్య `వందే భారత్` రైలు ట్రయల్ రన్
భారత్ బుల్లెట్ ట్రైన్ (ట్రైన్-18) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య సోమవారం ట్రయల్ రన్ ప్రారంభించింది. ఈ రైలు జమ్ము తావీ స్టేషన్ కు ఈ మధ్యాహ్నం 12.45కు చేరింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ వందే భారత్ రైలు వయా జమ్ము తావీ రైల్వేస్టేషన్ మీదుగా కత్రా చేరుకుంటుంది. ఢిల్లీ-కత్రాల మధ్య దూరం 640 కిలోమీటర్లు. రాజధాని, శతాబ్ది, ఘటిమాన్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లతో సహా ఈ దూరాన్ని చేరుకోవడానికి 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. వాస్తవానికి ఈ సూపర్ ఫాస్ట్ లన్నీ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వాటికన్నా మించిన వేగంతో వందే భారత్  చైర్ కార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణిస్తూ ఢిల్లీ నుంచి కత్రాకు ఏడు గంటల్లోనే చేరుతుంది. ఢిల్లీ-వారణాసిల మధ్య నడిచే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఈ ఫిబ్రవరి14న ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ-కత్రా కు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జమ్ముతో పాటు మరో మూడు ప్రధాన నగరాలకు ఈ వందే భారత్ ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీ-జమ్ము-కత్రా, ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-కోల్ కతాలకు వందే భారత్ ను త్వరలో ప్రారంభించేందుకు యోచిస్తున్నారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఇంజిన్ లేని తొలి భారతీయ రైలైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపకల్పన చేసింది. ఢిల్లీ-వారణాసి మధ్య ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. ఈ రైలులో 1128 మంది ప్రయాణించొచ్చు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తయారీకయిన వ్యయం రూ.60 కోట్లు. యూరప్ నుంచి ఈ తరహా రైలు దిగుమతి చేసుకోవాలంటే రూ.100 కోట్లు వ్యయం అవుతుంది.