ఐసీసీ ప్రపంచ కప్-12 విజేత ఇంగ్లాండ్
ఎన్నాళ్లో వేచిన ఉదయం..
క్రికెట్ పుట్టినింట తొలిసారి ప్రపంచ కప్ ను ముద్దాడిన పండుగ.. వాడవాడలా సంబరాలతో ఇంగ్లాండ్
మునిగితేలుతోంది. క్రికెట్ ప్రపంచ కప్-12 ను సగర్వంగా
ఆతిథ్య జట్టు భుజాలకెత్తుకుని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చింది. ఇంగ్లాండ్ వరల్డ్ కప్
కొత్త చాంపియన్ గా అవతరించింది. న్యూజిలాండ్ పై ఆదివారం క్రికెట్ మక్కా లండన్
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో అనేక మెరుపులు..మలుపులు..
ఎవరు ఓడారో ఎవరు గెలిచారో తేలని సందిగ్ధతల నడుమ ఆఖరికి ఇంగ్లాండ్ విజేతగా
నిలిచింది. స్కోర్లు(241) సమానం..సూపర్ ఓవర్ రన్స్(15) సమానం.. విజేత న్యూజిలాండా, ఇంగ్లాండా అనే మీమాంస మధ్య
చివరికి ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో ఒక బౌండరీ అధికంగా కొట్టిన ఇంగ్లాండ్
విజేతయింది. సూపర్ ఓవర్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. బోల్ట్ బౌలింగ్ ను ఎదుర్కొని స్టోక్స్, బట్లర్ లు రెండు బౌండరీల సాయంతో 15పరుగులు స్కోరు చేశారు. అనంతరం న్యూజిలాండ్ ఛేదనకు దిగింది. గుఫ్తిల్, నీషమ్ లు ఆర్చర్ బౌలింగ్ ను ఎదుర్కొని ఓ సిక్సర్ తో 15పరుగులు సాధించి స్కోరును సమం చేశారు. దాంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది.
సూపర్ ఓవర్ నిబంధన లేకున్నట్లయితే వాస్తవానికి న్యూజిలాండే విజేత. స్కోర్లు సమానమైనప్పుడు తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు సహజంగానే గెలిచినట్లు లెక్క. కానీ వరల్డ్ కప్ లో స్కోర్లు సమానమైతే సూపర్ ఓవర్ ఆడించే నిబంధన ఉంది. అందులోనూ స్కోర్లు సమానమవ్వడం మరో అబ్బురం.
తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్
బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు
చేసింది. ఇంగ్లాండ్ కు అది ఏమంత ఛేదన లక్ష్యం.. సునాయాసంగా ఓ 10 ఓవర్ల ముందే
మ్యాచ్ ముగించేస్తారనే అందరూ అనుకున్నారు. కివీస్ మరోసారి భారత్ ను కంగు
తినిపించినట్లే పటిష్ఠ ఇంగ్లాండ్ ను 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంతవరకు
ఏ ప్రపంచ కప్ లో లేని విధంగా సూపర్ ఓవర్ అనివార్యమయింది. ఆ సూపర్ ఓవర్ లో
న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు రెండూ 15 పరుగులు స్కోరు చేశాయి. మళ్లీ రెండోసారి
మ్యాచ్ టై అవ్వడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో అధికంగా చేసిన బౌండరీ ఆధారంగా
ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. ఆతిథ్య జట్టుకు తొలి ప్రపంచ కప్ అందింది. వరుసగా
రెండోసారి ఫైనల్లో కప్ ను కోల్పోయి న్యూజిలాండ్ ఢీలా పడింది. 2015 ప్రపంచ కప్
ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన కివీస్ ఈసారి 2019లో అనూహ్యంగా
ఇంగ్లాండ్ చేతిలో సూపర్ ఓవర్ పరాజయాన్ని చవిచూసింది.