శర వేగంగా మారుతోన్న క`ర్ణాటక`
రాజకీయాలు
కర్ణాటకలో రాజకీయ క్రీడ జోరందుకుంది.
13 నెలల కుమారస్వామి (జేడీ-యూ,
కాంగ్రెస్ సంకీర్ణం) ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాక్షాత్తు
సుప్రీంకోర్టు కల్గజేసుకుని అసెంబ్లీలో నాటి యడ్యూరప్ప మంత్రివర్గం విశ్వాస
పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించడంతో ఆయన బలం నిరూపించుకోలేక రాజీనామా
చేసిన సంగతి తెలిసిందే. 224 మంది సభ్యుల విధానసభలో బీజేపీకి ప్రస్తుతం 104 మంది సభ్యుల
బలం ఉంది. జనతాదళ్ (జేడీ-యూ)కు 37,
కాంగ్రెస్ కు 78 మంది, బీఎస్పీ 1, ఇండిపెండెట్లుగా 2 సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు
113 మంది సభ్యుల బలం అవసరం కాగా తాజాగా 14 మంది తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా
చేస్తూ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ (కాంగ్రెస్)కు శనివారం లేఖలు సమర్పించారు. వీరిలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా 1 సభ్యుడు జేడీ(యూ)కి చెందిన వారు. 11
మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు తనకు అందినట్లు
స్పీకర్ విలేకర్లకు తెలిపారు. మంగళవారం వారితో వ్యక్తిగతంగా మాట్లాడి
విధివిధానాల ప్రకారం వ్యవహరించనున్నామన్నారు. కుమారస్వామి సర్కార్ భవితవ్యం ఏమిటని
విలేకర్లు ప్రశ్నించగా `వేచి చూద్దాం.. నేను చేసేది ఏమీ లేదు` అని స్పీకర్ రమేశ్
కుమార్ బదులిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ రంగంలోకి
దిగి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కూడా పలు
సందర్భాల్లో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డీకే నే ఎమ్మెల్యేల్ని
సర్దుబాటు చేశారు.