ఉత్కంఠ పోరులో అఫ్గనిస్థాన్ పై పాకిస్థాన్ గెలుపు
పాకిస్థాన్ అనుభవం ముందు అఫ్గనిస్థాన్ తేలిపోయింది. ఐసీసీ వరల్డ్
కప్-12 మ్యాచ్ నం.36 హెడింగ్లే లీడ్స్
వేదికపై శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో అఫ్గనిస్థాన్
పై విజయం సాధించింది. ఇంకా రెండు బంతులుండగానే పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఇమాద్
వసీం(49), వహాబ్ రియాజ్ (9బంతుల్లో15 పరుగులు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అఫ్గనిస్థాన్ ఈ
టోర్నీలో గెలుపు వాకిట వరకు వచ్చి బోల్తా కొట్టిన మూడో మ్యాచ్ ఇది. టాస్ గెలిచిన
అఫ్గనిస్థాన్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి
227 పరుగులు చేసింది. జట్టులో అస్ఘర్ అఫ్గన్, నజీబుల్లా జద్రాన్లు చెరో 42 పరుగులు
చేశారు. జట్టులో వీరిదే అత్యధిక స్కోరు. ఓపెనర్ రహ్మత్ షా(35), వికెట్ కీపర్
బ్యాట్స్ మన్ ఇక్రమ్ అలీ ఖిల్(24) మాత్రమే జట్టులో 20 పరుగులకు పైగా స్కోరు
చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి
ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇమాద్ వసీం, వహబ్ రియాజ్ లు
చెరో 2 వికెట్లు తీయగా షాదబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని
ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ కు విజయం అలవోకగా రాలేదు. పరుగులేమీ
చేయకుండానే పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్(0) వికెట్ కోల్పోయింది. ముజ్బుర్ రెహ్మాన్
అతణ్ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. బాబర్ ఆజం(45), ఇమామ్ ఉల్ హక్(36), ఇమాద్
వసీం(49), హరీస్ సొహాయిల్(27) రాణించారు. 46వ ఓవర్ వరకు పాక్ వికెట్లను తీస్తూ అఫ్గన్
బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. అప్పటికి పాక్ స్కోరు 7 వికెట్ల
నష్టానికి 206 పరుగులు. చివర్లో బౌలింగ్ ఫీల్డింగ్ ఒక్కసారిగా పట్టుతప్పడం వహబ్
రియాజ్, ఇమాద్ వసీంలు బ్యాట్ ఝళిపించడంతో అఫ్గన్ ఓటమి
పాలయింది. పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి విజయం
సాధించింది. కెప్టెన్ గుల్బుద్దీన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో విఫలమయ్యాడు. ఓపెనర్
గా బ్యాటింగ్ కి దిగి కేవలం 15 పరుగులే చేశాడు. బౌలింగ్ లో వికెట్ లేమీ తీయకుండా అందరికంటే
ఎక్కువగా 73 పరుగులిచ్చాడు. ముజ్బుర్ రెహ్మన్ 34/2 మహ్మద్
నబీ 23/2 రషీద్ ఖాన్ 50/1 వికెట్లు పడగొట్టారు. ఆల్ రౌండర్
ప్రదర్శనతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం మ్యాన్
ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.