Wednesday, June 19, 2019

South Africa mp racially abused at tourist site


వర్ణ వివక్షకు గురైన దక్షిణాఫ్రికా ఎంపీ ఫుంజైల్ వాండమే
దక్షిణాఫ్రికాలో ఇంకా జాత్యాహంకార ధోరణులు పూర్తిగా సమసి పోలేదనడానికి సాక్షాత్తు ఆ దేశ పార్లమెంట్ ఎంపీకే ఎదురైన అవమానం ఉదాహరణగా నిలుస్తోంది. డెమోక్రటిక్ అలయెన్స్ కు చెందిన ప్రతిపక్ష సభ్యురాలు ఫుంజైల్ వాండమే ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోలీసుల్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఆమె దేశ రాజధాని కెప్ టౌన్ లోగల ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం విక్టోరియా ఆల్ఫ్రెడ్ వాటర్ ఫ్రంట్ (వీ&ఏ వాటర్ ఫ్రంట్) సందర్శనకు వెళ్లినప్పుడు తనకు ఈ దుస్సంఘటన ఎదురైందన్నారు. అక్కడ గల షాపింగ్ మాల్ లో రద్దీ నెలకొనడంతో వరుసలో ఓ తెల్లజాతీయురాలి వెనుక నిలబడ్డానని వాండమే తెలిపారు. ఇంతలో ఆమెతో వచ్చిన తెల్లజాతి వ్యక్తి తనను పక్కకు లాగేశాడన్నారు. ఎందుకని ప్రశ్నించిన తనను నువ్వు నల్ల జాతీయురాలివి అంటూ దుర్భాషలాడినట్లు వాండమే తెలిపారు. వాగ్వాదంలో తనపై దాడికి యత్నించడంతో ఆత్మరక్షణార్థం అతని మొహంపై పిడిగుద్దులు కురిపించినట్లు చెప్పారు. ఈ మేరకు వీడియోను ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ షాపింగ్ మాల్ యాజమాన్యానికి `మీరు వర్ణ వివక్షకు మద్దతు ఇస్తున్నట్లయితే బయట బోర్డు తగిలించండి.. నేను మాత్రం ఈ తరహా వివక్షకు ఎవరు పాల్పడినా సహించను` అంటూ వాండమే ఘాటుగా లేఖ రాశారు. దాంతో ఆ షాపింగ్ మాల్ యాజమాన్యంతో పాటు వీ&ఏ వాటర్ ఫ్రంట్ నిర్వాహకులు ఎంపీని క్షమాపణలు వేడుకున్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) అధికారంలో ఉండగా డెమోక్రటిక్ అలయెన్స్ (డీఏ) ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష డీఏ లో వాండమే అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె గ్రాహమ్స్ టౌన్ లో గల రోడ్స్ యూనివర్సిటీ నుంచి 2007లో డిగ్రీ పట్టా పొందారు.

Modi wishes good health, long life to Rahul Gandhi on his birthday



రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో అభినందనల వెల్లువ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన 49 జన్మదిన వేడుకల్ని ఘనంగా అభిమానుల మధ్య జరుపుకున్నారు. బుధవారం ఆయనను తల్లి సోనియాగాంధీ తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. చెల్లెలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టిన రోజు అభినందనలు తెలిపారు.  ప్రధాని మోదీ ట్విటర్ లో రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెల్పుతూ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రియతమ నేత జన్మదినాన్ని పరస్పరం శుభాకాంక్షలు తెల్పుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. తనకు పుట్టిన రోజు అభినందనలు చెప్పిన అందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.

Tuesday, June 18, 2019

Earthquakes in china kills 11, injuries over 100



చైనాలో భూకంపం 11 మంది దుర్మరణం
చైనాలో సోమవారం అర్ధరాత్రి రెండు ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడగా మరో 122 మంది తీవ్రగాయాలపాలయ్యారు. చైనా నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్ యుబిన్ కౌంటీలో సోమవారం రాత్రి 11.55 ప్రాంతంలో తొలి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదయింది. భూమి లోపల 16 కి.మీ. లోతున భూకంపకేంద్రాన్ని గుర్తించిన్నట్లు చైనా ఎర్త్ క్వాక్ నెట్ వర్క్స్ సెంటర్ (సీఈఎన్సీ) వర్గాలు తెలిపాయి. రాజధాని చెంగ్డ్యూతో పాటు మరో నగరం చోంగ్వింగ్ భూకంపాల తీవ్రతకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రజలు ఫ్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రెండో భూకంపం 5.2 తీవ్రతతో సంభవించినట్లు చాంగ్వింగ్ కౌంటీలోని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. సిచువాన్ ప్రావిన్స్ లో 2008 నాటి తీవ్ర భూకంపంలో సుమారు 70వేల మంది మృత్యువాత పడ్డారు. ఇళ్లు కూలిపోయిన ఘటనలో జనం ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అత్యవసర సహాయక బృందాలు, సైనిక, పోలీసు సిబ్బంది శిథిలాల తొలగింపు పనుల్ని చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Mamata to skip tomorrow`s all party heads meet in delhi



ప్రధాని సారథ్యంలోని అఖిల పక్ష సమావేశానికి మమతా డుమ్మా!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని అఖిల పక్ష అధినేతల సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానని తేల్చి చెప్పారు. బుధవారం జరుగనున్న ఈ సమావేశానికి ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ముందుగా నిర్ణయమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తను ఈ సమావేశానికి హాజరుకాబోవడం లేదని మమతా మంగళవారం తెలిపారు. జూన్ 15న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం మమతా హాజరుకాని సంగతి తెలిసిందే. `ఒకే దేశం.. ఒకే ఎన్నికలు` అనే అంశంపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్రానికి సూచించారు. ఈ విషయమై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరగాలని కోరారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటూ హడావుడిగా నిర్ణయం తీసుకుని అమలుచేసే అంశం కాదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తగినంత వ్యవధి తీసుకుని అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరిగాకే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందన్నారు. చాలా ముఖ్యమైన విషయమైనందున కూలంకుషంగా ఆలోచించాకే నిర్మాణాత్మక సూచనల్ని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేస్తుందన్నారు. 2022లో జరుగనున్న దేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో, ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో టీఎంసీ హృదయపూర్వకంగా పాల్గొంటుందని మమతా తెలిపారు.