ఆల్ రౌండ్ ప్రతిభతో పాక్ ను చిత్తు చేసిన భారత్
వరుణుడు అసలు కరుణిస్తాడా? మ్యాచ్ జరుగుతుందా లేదా అనే
మీమాంస తో ప్రారంభమైన భారత్- పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ లో చివరకు విజయం మెన్ ఇన్ బ్లూనే
వరించింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.22 ఆదివారం మాంచెస్టర్ వేదికపై జరిగిన భారత్ పాకిస్థాన్ క్రికెట్
పోరులో గెలుపు ఆల్ రౌండ్ నైపుణ్యం పక్షానే నిలిచింది. వర్షం ఇరు జట్ల ఇన్నింగ్స్
లో రెండు సార్లు కొద్ది సేపు అంతరాయం కల్గించగా డక్ వర్త్ లూయిస్ (డీఆర్ఎస్) నిబంధనల
ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. ప్రపంచ కప్ సమరంలో
భారత్ ఏడింటికి ఏడు సార్లు పాకిస్థాన్ పై గెలిచి రికార్డు నెలకొల్పింది. టాస్
గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫ రాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ 50 ఓవర్లలో 336/5 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేని లోటును
వరల్డ్ కప్ లో తొలిసారి ఓపెనర్ గా దిగిన కె.ఎల్.రాహుల్(57) చక్కగా భర్తీ చేశాడు. నిలకడైన
ఆటతీరుతో అర్ధ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. వరల్డ్ టాప్ ఓపెనర్ రోహిత్ శర్మ బాధ్యతంతా
భుజాలకెత్తుకుని టోర్నీలో రెండో సెంచరీ కొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అర్ధ
సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 337 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన
పాకిస్థాన్ ఆద్యంతం పేలవమైన ఆటతీరునే కనబర్చింది. చక్కటి లైన్ అండ్ లెంగ్త్ లో
బౌలింగ్ చేస్తున్న భువనేశ్వర్, బూమ్రా ల పేస్ జోడీకి విజయ్ శంకర్, హార్ధిక్
పాండ్యా జత కలిశారు. స్పిన్ తో కుల్దీప్ పాక్ బ్యాట్స్ మెన్ ను కట్టి పడేశాడు. అప్పటికే
అయిదు వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేసి పీకల లోతు కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ ను వర్షం కూడా
దెబ్బతీసింది. 40 ఓవర్లలో 302 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించడంతో పాక్ చివరకు
6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఓటమి పాలయింది. బౌలింగ్ ఛేంజ్ లో బంతిని
అందుకున్న ఆల్ రౌండర్ మీడియం పేసర్ విజయ్ శంకర్ తొలివికెట్ గా ఓపెనర్ ఇమామ్ ఉల్
హక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ కు పంపాడు. వన్ డౌన్ బ్యాట్స్ మన్ బాబార్(48)
ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ లో కుదురుకున్న ఫకర్ జమాన్(62) కూడా
కుల్దీప్ బౌలింగ్ లో చాహర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మహ్మద్ హఫీజ్, షోయబ్
మాలిక్ వికెట్లను హార్ధిక్ పాండ్యా తీసుకున్నాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ పాక్
కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఔట్ చేసి తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. 35 ఓవర్ల గడిచిన ఇన్నింగ్స్ లో ఏ మాత్రం విజయావకాశాలు లేని దశలో
వర్షం పడ్డంతో మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటికి మళ్లీ ప్రారంభమైనా పాక్ గెలిచే
పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో రోహిత్
(140), కోహ్లి(77), రాహుల్ (57) భారీ స్కోరుపై కన్నేసి పరుగులు రాబట్టారు.
ముఖ్యంగా రాహుల్, రోహిత్ జోడి బ్యాట్ కు అందివచ్చిన బంతిని బౌండరీకి తరలిస్తూ లైన్
అండ్ లెంగ్త్ బంతులకు సింగిల్, డబుల్ రన్స్ తీస్తూ తొలి వికెట్ కు 23.5 ఓవర్లలో
136 పరుగులు జోడించారు. పరుగులు తీసే క్రమంలో రాహుల్ తొందరపాటు వల్ల రోహిత్ రనౌటయ్యే
ప్రమాదంలో పడ్డాడు. ఫీల్డింగ్ లోపం కూడా పాక్ జట్టులో కొట్టొచ్చినట్లు
కనిపించింది. కోహ్లి బౌన్సర్ ను ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్ కు తగిలిందనకుని
ఔటవ్వకుండానే పెవిలియన్ చేరి పొరపాటు చేశాడు. అంతకుముందే వర్షం వల్ల మ్యాచ్ 46.2
ఓవర్ల వద్ద నిలిచిపోయింది. ఆ తర్వాత కోహ్లి అనుకోకుండా పెవిలియన్ చేరడంతో చివర్లో 14
బంతుల్ని విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఎదుర్కొన్నారు. పాక్ బౌలర్లలో పొదుపుగా
పరుగులిచ్చిన మహ్మద్ అమీర్ మరోసారి మూడు వికెట్లు పడగొట్టగా హసన్ అలీ, వహాబ్
రియాజ్ లకు చెరో వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరోసారి రోహిత్ శర్మ ను వరించింది.