Thursday, June 13, 2019

Dr.harsh vardhan condemns violence against doctors urges for restrain


వైద్యులపై దాడుల్ని రాష్ట్రాలు నిలువరించాలి: కేంద్రమంత్రి వర్ధన్
దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడుల్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తీవ్రంగా ఖండించారు. సమాజ శ్రేయస్సుకు వైద్యులు మూల స్తంభాలని అటువంటి వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు కల్గించడం, ఒత్తిళ్లకు గురి చేయడం మంచిది కాదని హితవు పలికారు. వైద్యులపై దాడులు జరగకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని గురువారం (జూన్13) ఆయన ఓ ప్రకటనలో కోరారు. వైద్యులు కూడా రోగుల అత్యవసర ఆరోగ్య అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని నిరసనలకు స్వస్తి చెప్పి విధుల్లో చేరాలని మంత్రి హర్షవర్దన్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఎన్.ఎస్.ఆర్. మెడికల్ కాలేజీ లో మంగళవారం డాక్టర్ లపై జరిగిన దాడిని ఉద్దేశించి కేంద్ర మంత్రి ఈ మేరకు విన్నవించారు. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై కోల్ కతాలో దుండగులు దాడి చేయడంతో ఇద్దరు వైద్యులు గాయాలపాలయ్యారు. మరో వైపు సీఎం మమతా బెనర్జీ గురువారం మధ్యాహ్నం 2 గంటల కల్లా విధుల్లో చేరాలని సమ్మె చేస్తున్న వైద్యులకు అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాము కోరుకుంటున్న భద్రతా ప్రమాణాలు మెరుగయ్యే వరకు సమ్మె విరమించేది లేదని వైద్యులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సభ్యులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొనాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కోరింది. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఉదయం 10 నుంచి 12 వరకు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ మెమొరాండంను ఆయా జిల్లాల కలెక్టర్లకు సమర్పించాలని ఐఎంఏ కోరింది. బెంగాల్ లో జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంఘీభావం తెల్పుతూ ఢిల్లీ లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో వైద్యులు శుక్రవారం చేతులకు బ్యాండేజీలు ధరించి విధులు నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (ఆర్డీఏ) ప్రకటించింది.

Wednesday, June 12, 2019

triple talaq bill to be introduced in ensuing parliament session



ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం
ముస్లిం వివాహిత మహిళలకు రక్షణ కవచంగా నిలిచే ట్రిపుల్ తలాఖ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. గత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మంగళవారం (జూన్12) తెలిపారు. ఈ నెల 17 సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బిల్లుకు సవరణలు కోరుతూ గతంలో రాజ్య సభలో ప్రతిపక్షాలు అడ్డు తగలడంతో తాత్కాలికంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను  జారీ చేయాల్సి వచ్చింది. ముమ్మార్లు తలాఖ్ (తలాఖ్-ఈ-బిద్దత్) చెప్పి ఓ వివాహిత ముస్లిం మహిళకు భర్త విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని ప్రభుత్వం దేశంలో అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్ ను తెచ్చింది. ఆ విధంగా ఎవరైనా ముమ్మార్లు తలాఖ్ చెప్పి విడాకులిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. 29 ఆగస్ట్ 2018లో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాఖ్ బిల్లును గత ఎన్డీయే ప్రభుత్వం అదే ఏడాది పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ఆ ఏడాది డిసెంబర్ లో లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో బిల్లుకు సంబంధించి కొన్ని అంశాల పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం తెల్పుతూ సవరణలు కోరాయి. అప్పటి నుంచి పార్లమెంట్ ఆమోదం లభించక ట్రిపుల్ తలాఖ్ చట్ట వ్యతిరేకం అంటూ కేంద్రం తాజా ఆర్డినెన్స్ ను జారీ చేయాల్సి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ట్రిపుల్ తలాఖ్ చెప్పడం నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. కోర్టు విచారణ సమయంలో కూడా నిందితుడికి బెయిల్ పొందే అవకాశం లేదు. పోలీస్ స్టేషన్ లో స్టేషన్ బెయిల్ కూడా మంజూరు కాదు. బాధిత భార్య వాదనను విన్న అనంతరమే న్యాయస్థానం నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చా లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 17వ లోక్ సభ కొలువుదీరాక కేంద్రం ఈ ట్రిపుల్ తలాఖ్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను 10 ఆర్డినెన్స్ లుగా జారీ చేయదలచింది. అందులో ఒక ఆర్డినెన్స్ ప్రకారం పూర్తిగా ట్రిపుల్ తలాఖ్ పై నిషేధం విధించనున్నారు. తాజా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయిన 45 రోజుల లోపు ఈ ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ (10) చట్టంగా అమలులోకి రానున్నాయి.

Tuesday, June 11, 2019

Japan`s pm discusses iran situation with trumph ahead of Tehran visit



ట్రంప్ తో ఫోన్ లో సంభాషించిన జపాన్ ప్రధాని
ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న జపాన్ ప్రధాని షింబో అబె అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ తో టెలిఫోన్ లో సంభాషించారు. షింబో బుధవారం ఇరాన్ పర్యటనకు వెళ్తున్నారు. మంగళవారం ఈ విషయమై 20 నిమిషాల పాటు ట్రంప్ తో ముచ్చటించారని అబె కేబినెట్ చీఫ్ సెక్రటరీ (మంత్రి) యోషిహిడె సుగా విలేకర్లకు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలలో పరిస్థితులు, ప్రాంతీయ అంశాలు, ముఖ్యంగా ఇరాన్ ప్రస్తుత వ్యవహారాలు ఉభయ దేశాల నేతల మధ్య చర్చకు వచ్చాయన్నారు. 1978 తర్వాత జపాన్ ప్రధాని ఇరాన్ లో పర్యటించనుండడం ఇదే తొలిసారి. నాటి జపాన్ ప్రధాని టకియో ఫుకుడా ఇరాన్ లో పర్యటించారు. నాలుగు దశాబ్దాలుగా ఇస్లామిక్ వాదం ప్రపంచ పటంపై ప్రముఖంగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని అబె పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. అదీ గాక టెహరాన్(ఇరాన్) అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్న దరిమిలా అమెరికాతో ఆ దేశ ద్వైపాక్షిక సంబంధాలకు పూర్తిగా విఘాతం కల్గింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ దశలో జపాన్ ప్రధాని అబె ఇరాన్ లో పర్యటించాల్సి రావడంతో ముందుగానే అమెరికా అధ్యక్షుడితో సంభాషించి ముందడుగు వేస్తున్నారు. ఇరాన్ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని అబె ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖొమైనీ, అధ్యక్షుడు హసన్ రౌహనిలను విడివిడిగా కలుసుకుని సంప్రదింపులు జరుపనున్నారు.

Cyclone 'Vayu': Heavy rainfall prediction for Goa



గోవాను వణికిస్తోన్న `వాయు` తుపాను
తుపాను `వాయు` ప్రభావంతో గోవాను బుధవారం భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన `వాయు` తుపాన్ కారణంగా భారీ వర్షాలతో పాటు 250కి.మీ. నుంచి 300 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వర్గాలు హెచ్చరించాయి. ఐఎండి గోవా ఇన్ చార్జి డైరెక్టర్ కె.వి.పడ్గల్వార్ వివరాలు వెల్లడిస్తూ `వాయు` తుపాను గోవాతో పాటు సౌరాష్ట్ర(గుజరాత్)పై తీవ్ర ప్రభావం చూపనుందన్నారు. రాగల 36 గంటల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పాటు నీటిమట్టం భారీగా పెరగనుందని చెప్పారు. పర్యాటకులు తీరంలో ఈతకు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తుపాను తీవ్రతను బట్టి నారింజ రంగు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు పెను గాలులు, భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.