రిటైర్మెంట్ ప్రకటించిన 6
సిక్సర్ల యువరాజ్
భారత క్రికెటర్లలో తనదైన
ముద్ర వేసిన యువరాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఈ
విషయాన్ని ముంబైలో సోమవారం (జూన్10) ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో భారత జట్టుకు
ఎంపికైన యువరాజ్ 2017లో తన చివరి టి-20 మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్
మ్యాచ్ లో ఒక ఓవర్లో ఆరు బంతులు ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత భారత్ తరఫున యువరాజ్ కే
సొంతమైంది. 2007 టి-20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో యువరాజ్ ఈ ఘనత
సాధించాడు. కేవలం 16 బంతుల్లోనే 57 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా
నిలిచాడు.
తొలుత ఒకే ఓవర్లో ఆరు
బంతుల్ని ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత వెస్టిండిస్ బ్యాట్స్ మన్ గ్యారీ సోబర్స్(1968)
కు దక్కింది. ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్ మ్యాచ్ లో సోబర్స్ ఆరు సిక్సర్లు కొట్టారు.
అదే తరహాలో రంజీ మ్యాచ్ లో బరోడాపై బొంబాయి తరఫున ఆడుతున్న ప్రస్తుత భారత జట్టు కోచ్
రవిశాస్త్రి (1985) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల రికార్డు సాధించాడు. అంతర్జాతీయ
క్రికెట్ లో 2007 ఐసీసీ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా ఆటగాడు
హెర్షెలి గిబ్స్ ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డు ను అందుకున్నాడు.
2011 వరల్డ్ కప్
రెండోసారి సాధించిన భారత జట్టు సభ్యుడు వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ ఆ టోర్నీలో
పలు మ్యాచ్ ల్లో ఆల్ రౌండర్ నైపుణ్యం కనబర్చాడు. ముఖ్యంగా ఆ వరల్డ్ కప్ సెమీ
ఫైనల్స్, ఫైనల్స్ లో యువరాజ్ ఆమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే కెరీర్ ఉజ్వలంగా ఉన్న దశలో 2011లోనే కేన్సర్ బారినపడిన యువీ తర్వాత కోలుకున్నా క్రికెట్ లో మునుపటి పట్టును సాధించలేకపోయాడు. 40
టెస్టులాడిన యువీ 3 సెంచరీలతో 1900 పరుగులు, 304 వన్డేలకు గాను 14 సెంచరీలతో 8701
పరుగులు చేశాడు. 58 టి-20 మ్యాచ్ ల్లో 1177 పరుగులు, ఐపీఎల్ లో 132 మ్యాచ్ లకు
గాను 2750 పరుగులు స్కోరు చేశాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ వంటి
ఉద్దండులతో ఆడటం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు. తన కెరీర్ లో గంగూలీ, ధోని తనకు
ఎంతో సహకరించారని యువీ తెలిపాడు.