Sunday, June 2, 2019

bangladesh shocking victory against south Africa



వాహ్..బంగ్లాదేశ్.. అనూహ్యంగా ఓడిన ప్రొటీస్
12 వరల్డ్ కప్ లో సంచనాలు మొదలయ్యాయి. పసికూన స్థాయి నుంచి ఇటీవల ఎదిగిన బంగ్లాదేశ్ జట్టు మరోసారి సంచలనానికి నాంది పలికింది. తనకన్నా అత్యుత్తమమైన అతి పెద్ద జట్టు దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ప్రొటీస్ తో ఆదివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్ నం.5లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబర్చి చివరకు 21 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది. భారత ఉప ఖండం క్రికెట్ కీర్తి పతాకను రెపరెపలాడించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ గెలిచి బంగ్లాను బ్యాటింగ్ కు దింపాడు. నిలకడైన ఆటతీరుతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 6వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. 331 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ప్రొటీస్ కెప్టెన్ డుప్లెసిస్ (62), మార్కరమ్(45), డుమిని(45), రాస్సే వాన్ డెర్ డస్సెన్(41), డేవిడ్ మిల్లర్(38) ఇలా జట్టులో అందరూ చెప్పకోదగ్గ స్కోరే చేశారు. ఒక్క ఆండిలే ఫెహ్లుక్వాయో(8)ఒక్కడు మాత్రమే రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. అందరూ కొద్దొగొప్పో పరుగులు చేశారు గానీ చివరకు జట్టును విజయతీరాన నిలపలేకపోయారు. చివరికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. బంగ్లా పేసర్లలో ముస్తాఫిజర్ రెహమాన్ ధారాళంగా 67 పరుగులిచ్చినా మూడు వికెట్లను పడగొట్టాడు.  మహ్మద్ సైఫుద్దీన్ రెండు వికెట్లు తీశాడు. సైఫుద్దీన్ కూడా భారీగానే 57 పరుగులు ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. మెహిదీ హసన్, షకీబ్ అల్ హసన్ చెరో వికెట్ పడగొట్టి దక్షిణాఫ్రికాను ఓటమి పాల్జేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టులో మూడు,నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ కు దిగిన షకీబ్ అల్ హసన్(75), ముప్ఫికర్ రహేమ్(78)తో పాటుగా ఓపెనర్ సౌమ్య సర్కార్ (42) ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగులు చేశారు. మహ్మదుల్లా(46), మెసద్దిక్ హుస్సేన్ (26) చివర్లో చెలరేగి ఆడ్డంతో జట్టు భారీ స్కోరు సాధించడమే కాకుండా మ్యాచ్ గెలుపునకు బాటలు పరిచింది. బ్యాటింగ్ లో 75 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో ఓ వికెట్ తీసిన షకీబ్ అల్ హసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

3 doctors held for colleague suicide sent to judicial custody



జూ.డా. ఆత్మహత్య కేసులో ముగ్గురు డాక్టర్లకు కటకటాలు
కులం పేరుతో వేధింపులకు పాల్పడి యువ వైద్యురాలి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు మహిళా వైద్యుల్ని ముంబయిలోని ప్రత్యేక కోర్టు కటకటాల వెనక్కి నెట్టింది. 26 ఏళ్ల పాయల్ తద్వి అనే జూనియర్ డాక్టర్ ను డా.భక్తి మెహర్, డా.హేమా అహుజా, డా.అంకితా ఖండేల్వాల్ తరచు వేధించేవారు. ఈ నేపథ్యంలో పాయల్ భరించలేక మే22న తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయారు. వీరంతా బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలోనే పనిచేస్తున్నారు. ఎస్టీ వర్గానికి చెందిన తద్వి రిజర్వేషన్ కోటాలో సీటు సంపాదించినట్లుగా ఈ ముగ్గురు సీనియర్ మహిళా వైద్యులు ఆమెను మానసికంగా వేధించేవారని తెలిసింది. నిందితులు ముగ్గురిపై ఎస్సీ,ఎస్టీ వర్గాలపై అకృత్యాల నివారణ చట్టం, యాంటీ ర్యాంగింగ్ చట్టం, ఐ.టి.చట్టం, ఆత్మహత్యకు ప్రేరేపించడం (సెక్షన్ 306) కింద కేసులు పెట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ స్థానిక పోలీసులకు కేసును అప్పగించొచ్చని వారి కస్టడీకి నిందితుల్ని ప్రశ్నించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్.ఎం.శద్రాణి తోసిపుచ్చారు. నిందితులకు జూన్ 10 వరకు జ్యూడిషియల్ కస్టడీ కొనసాగించాలని తీర్పిచ్చారు.

venkaiah naidu asks people to study debate draft new education policy



పరిశోధనాత్మక విద్యా విధానం రావాలి: ఉపరాష్ట్రపతి
బస్తాలకొద్దీ పుస్తకాల్ని భుజాలకెత్తుకుని మోసుకెళ్లే విద్యావిధానంలో మార్పులు రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఆదివారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐ.ఐ.పి.ఇ) ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సులో ఆయన పలు విలువైన సూచనలు చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల సమన్వయంతో విద్యా ప్రమాణాల పెంపు అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పిల్లలకు తొలుత పుస్తకాల సంచి బరువును తగ్గించాలన్నారు. ఆటపాటలతో పాటు విలువలు, సాంకేతిక, చారిత్రక, తార్కిక ఆలోచనా ధోరణిని విద్యార్థులకు అలవర్చాలన్నారు. మెరుగైన విద్యావిధానం ద్వారా ఉత్తమ శ్రేణి ఉద్యోగార్థులు మన ముందుకు వస్తారని అందుకు పరిశ్రమలు, సంస్థలు విద్యా సంస్థలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన తోడ్పాటును అందించాల్సి ఉంటుందన్నారు. కొంగొత్త ఆవిష్కరణలకు విద్యార్థుల స్థాయి నుంచే పరిశోధనలు జరగాలని అందుకు పరిశ్రమలు మరింత ముందడుగు వేసి విద్యాసంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. వృత్తి విద్యా సంస్థల నుంచి చాలా మంది విద్యార్థులు తగిన ఉద్యోగ నైపుణ్యాలు లేకుండానే బయటకు వస్తున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అభిరుచి, సామర్థ్యం, నైపుణ్యం అవసరమని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కాదలచిన వారికి ఇవన్నీ ముఖ్యమని చెప్పారు. విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు జీవితానికి అవసరమయ్యే లోక జ్ఞానం, భాషా పటిమ, సాంకేతిక మెలకువలు, ఔత్సాహిక నిపుణత తదితరాలు కూడా కావాలన్నారు. ప్రజలూ విద్యా విధానంపై సమగ్రంగా ఆలోచించి తర్కించి.. చర్చించాకే ఓ నిర్ణయానికి రావాలని వెంకయ్యనాయుడు కోరారు. అప్పుడే విద్యా విధానంలో సముచిత మార్పులు సాధ్యమన్నారు.

Saturday, June 1, 2019

Newzealand beat srilanka by 10 wickets



శ్రీలంకపై కివీస్ అలవోక విజయం
కార్డిఫ్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ నం.3లో శనివారం కివీస్ జట్టు ఆడుతూ పాడుతూ శ్రీలంకపై గెలిచేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలయమ్సన్ శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కూడా మరో  టీ20 మ్యాచ్ నే తలపించింది. కెప్టెన్ దిముత్ కరుణరత్నే అర్ధ సెంచరీ(52 నాటౌట్) మినహా ఏ బ్యాట్స్ మన్ క్రీజ్ లో కుదురుకోలేదు. తిసార పెరీరా (27పరుగులు) మాత్రమే కాస్తంత కెప్టెన్ కు బాసటగా నిలిచాడు. ఫర్గుసన్, మాట్ హెన్నీలు చెరి మూడు వికెట్లు పడగొట్టారు. భారత్ ఉపఖండానికి చెందిన పాక్ జట్టు శుక్రవారం 105 పరుగులకే అలౌట్ కాగా ఈరోజు శ్రీలంక జట్టు కూడా 29.3 ఓవర్లలో 136 పరుగులకే బ్యాట్ ఎత్తేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఎటువంటి తడబాటు లేకుండా కివీస్ ఓపెనర్లు గుప్తిల్(73 నాటౌట్), కొలిన్ మున్రో(58 నాటౌట్) చెరో అర్ధసెంచరీలు కొట్టారు. 16.1 ఓవర్లలోనే 137 పరుగులు చేసి జట్టుకు 10 వికెట్ల విజయాన్ని అందించారు.
ఆసిస్ పై చెప్పుకోదగ్గ స్కోరు చేసిన అఫ్ఘానిస్థాన్ (207 ఆలౌట్)
ఆస్ట్రేలియాతో శనివారం బ్రిస్టోల్ లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ నం.4లో టాస్ గెలిచిన అప్ఘానిస్థాన్ కెప్టెన్ గుల్బుద్దీన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆదిలో అయిదు వికెట్లు త్వరత్వరగా పడిపోయిన నజీబుల్లా జర్దాన్ తో కలిసి గుల్బుద్దీన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరూ క్రీజ్ నిలిచి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాక బ్యాట్ ఝళిపించారు. ముఖ్యంగా అప్పటికే రెండు వికెట్లు తీసిన స్పినర్ జంపాను నజీబుల్లా ఓ ఆట ఆడుకున్నాడు. అతని ఓవర్ లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్ లో ఇదే క్రమంలో ఒక అనవసరమైన షాట్ కొట్టి కెప్టెన్ గుల్బుద్దీన్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు. నజీబుల్లా అర్ధ సెంచరీ (51), రహ్మత్ షా 43 పరుగులు, దూకుడుగా ఆడిన రషీద్ ఖాన్ 27 పరుగులు చేసి జట్టు చెప్పుకోదగ్గ స్కోరు 207 (ఆలౌట్) పరుగులు సాధించేందుకు తోడ్పడ్డారు.