Wednesday, May 29, 2019

left reunification is panacea to fight bjp says cpi



బీజేపీని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరం
దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు వామపక్షాల ఏకీకరణ అత్యవసరమని సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కాషాయీకరణ ప్రమాదపుటంచున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జులై 19 నుంచి21 వరకు జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ దిశగా చర్చల్ని ముమ్మరం చేయనున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం(మే29) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వామపక్షాలన్నీ ఒక్క పార్టీగా ఏకీకృతం కావాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఇప్పుడు కూడా పరిస్థితులు ఏకీకరణనే డిమాండ్ చేస్తున్నట్లయితే ఆ దిశగా అన్ని వామపక్షాలు అడుగులేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం ఒకటి కన్నా తక్కువకు పడిపోయిన నేపథ్యంలో జాతీయపార్టీ హోదాను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీపీఐ జాతీయ కార్యవర్గ భేటీలో సమీక్ష నిర్వహించారు. వామపక్షాల సహా లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు ఈ ఎన్నికల్లో బాగా దెబ్బతినడం వల్లే బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేయగల్గిందని సుధాకర్ రెడ్డి అన్నారు. లౌకికవాదాన్ని కాపాడే క్రమంలో తమిళనాడులోని డీఎంకే సంకీర్ణ పక్షాలకు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాల్ని కేటాయించిందన్నారు. ఒక్క తమిళనాడు లోనే కాంగ్రెస్, డీఎంకే కూటమితో సీపీఐ రెండు స్థానాల్లో విజయం సాధించింది. దేశంలో 1925లో ఏర్పడిన సీపీఐ పార్టీ ఏ రాజకీయ సిద్ధాంతాన్ని అనుసరించాలనే ఏకైక అంశంపై రెండుగా చీలిపోయింది. 1964 కోల్ కతాలో జరిగిన సీపీఐ ఏడో సర్వసభ్య సమావేశాల్లో చీలిక సంభవించి సీపీఐ(ఎం) ఏర్పడింది.

Tragedy averted, 50 girls rescued from blaze in Janakpuri hostel



అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 55 మంది బాలికలు
పశ్చిమ ఢిల్లీలో బుధవారం (మే29) ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం బారినపడ్డ 55 మంది బాలికల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సూరత్ లో ఇటీవల ఓ ఆర్ట్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరగ్గా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఢిల్లీ జనక్ పురి మెట్రో రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఓ బాలికలు వసతి గృహం(హాస్టల్)లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్నికీలలు చుట్టుముట్టగా పిల్లలు అల్లాడిపోయారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలతో సిబ్బంది రంగంలోకి దిగారు. అందులోని బాలికలందర్నీ సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. అయితే వీరిలో ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో ఇద్దరు బాలికల్ని డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరందరి ఊపిరితిత్తుల్లోకి విపరీతంగా పొగ చూరగొనడంతో అస్వస్థతపాలయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది కట్టడి చేశారు. తీవ్రంగా శ్రమించి వసతి గృహ భవనంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ సర్వీస్(డి.ఎఫ్.ఎస్) చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. తమకు తెల్లవారు 3సమయంలో సమాచారం అందగా వెంటనే అక్కడకు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది చేరుకున్నారన్నారు. మంటల్ని 3.30 సమయానికి పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

Tuesday, May 28, 2019

3 West Bengal MLAs, several councillors join BJP in Delhi



బీజేపీలో చేరిన ముగ్గురు పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలో మంగళవారం (మే28) కమలం తీర్థం పుచ్చుకున్న వారిలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు సుబ్రంగ్షు రాయ్ కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో సైతం బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. సుబ్రంగ్షు రాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని భావించిన టీఎంసీ ఆయనను లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సస్పెండ్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యే తుషార్కంటి భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేబేంద్ర నాథ్ రాయ్ తోపాటు పలువురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శి కైలాస్ విజయవర్గియ, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరారు. బెంగాల్ లో అధినేత్రి మమత నేతృత్వంలోని టీఎంసీ నుంచి ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేర్చడంలో ముకుల్ రాయ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ తాజా ఫలితాల్లో పశ్చిమబెంగాల్ లో బీజేపీ సుమారు రెండు పదుల స్థానాలు కైవశం చేసుకోవడంలో ఆయన తీవ్రంగా కృషి చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మమత 2011లో పాలనాపగ్గాలు చేపట్టినప్పటి తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారి టీఎంసీకి ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీకి 34 స్థానాలు దక్కగా ఈసారి 22 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ రాష్ట్రంలో 2 స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకింది.

Chandrababu participates in ntr`s birth anniversary programme



ఘనంగా ఎన్టీయార్ 97వ జయంతి వేడుకలు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలు మంగళవారం(మే28) ఘనంగా జరిగాయి. ఆయన మనవళ్లు సినీ నటులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ లు ఈ ఉదయం 6కే హైదరాబాద్ లోని ఎన్టీయార్ ఘాట్ కు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు తాతతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుంటూరు పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ `నా ప్రాణసమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభాభివందనాలు`... మన కుటుంబ పెద్ద  ఎన్టీయార్ తనకేదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆంధ్రుల ఆత్మగౌరవం, సమాజంలో చైతన్యం కోసమే వచ్చారన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని ఎదురు నిలిచారని చెప్పారు. ఎన్టీయార్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రగా నిలిచిపోయారన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలించారని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని నిరంతరం ప్రజాశ్రేయస్సుకే ముందుకు సాగుదామని చెప్పారు.