ప్రధానితో
జగన్ భేటీ
ఢిల్లీలో
ప్రధాని మోదీని ఆదివారం(మే26) కలిసిన జగన్ గంటపాటు సమావేశమయ్యారు. అనంతరం ఏపీ భవన్
లో విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. విభజన కోరుకోని ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన
నేపథ్యంలో హామీ ప్రకారం ప్రత్యేక హోదాను ఇవ్వాలి కదా అని విలేకర్లు అడిగిన
ప్రశ్నకు సమాధానమిచ్చారు. తమ ప్రాధాన్యాంశాల్లో ప్రత్యేక హోదా అంశం కచ్చితంగా
ఉందని ఇకపై ప్రధానిని కలిసిన ప్రతి సందర్భంలో ఇదే అడుగుతానన్నారు. మీ పై
కేసులున్నాయి కదా ఎలా ఎదుర్కోబోతున్నారన్న ప్రశ్నకు జగన్ ప్రజలిచ్చిన తాజా
తీర్పులోనే అవి వాస్తవమైనవా? కావా? అనే విషయం స్పష్టమౌతోందని చెప్పారు. తను అమిత్
షాను కూడా కలవడంపై జగన్ సమాధానమిస్తూ దేశంలో అమిత్ షా రెండో అత్యంత శక్తిమంతుడైన
నాయకుడు ఆయనను కలిసి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించానని, రాష్ట్రానికి ఆర్థిక
సాయం గురించి కోరానని జగన్ చెప్పారు. మీకు 22 మంది ఎంపీల బలం ఇప్పుడుంది
ప్రత్యేకహోదా సాధించగలమనే నమ్మకం ఉందా అని ఓ విలేకరి జగన్ ను ప్రశ్నించారు. అందుకు
బదులిస్తూ పత్యేక హోదాను ఇప్పుడు సాధించలేకపోతే ఇక ఎప్పటికీ రాదు.. తప్పకుండా తమ
స్థాయిలో తీవ్రంగా ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ ను
హైదరాబాద్ లో శనివారం (మే25) మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. తనకు ప్రత్యేక హోదాపై
పోరాటంలో మద్దతు ఇస్తానని కేసీఆర్ మరోసారి ప్రకటించారని జగన్ విలేకర్ల సమావేశంలో
వెల్లడించారు.