రాహుల్ దీదీల రాజీనామాల్ని అంగీకరించని
కాంగ్రెస్ తృణమూల్
కాంగ్రెస్
అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీ
ఏకగ్రీవంగా తిరస్కరించింది. శనివారం (మే25) ఢిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్
అత్యున్నత విధాయక మండలి (ఏఐసీసీ) ఈ మేరకు తీర్మానించింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్
కమిటీ కూడా ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లో
రాహుల్ కొనసాగాలని ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మీడియా ఇన్ చార్జ్ రణదీప్
సుర్జీవాలా పాత్రికేయులకు తెలిపారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన
జరిగిన ఏఐసీసీ సమావేశానికి రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి
ప్రియాంకతో కలిసి హాజరయ్యారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి దారుణపరాజయం పాలైన
నేపథ్యంలో రాహుల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన మే23నే రాజీనామాకు సిద్ధమవ్వగా సోనియా
వారించి ఏఐసీసీ భేటీ వరకు ఆగాలని సముదాయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కష్ట కాలంలో
సిద్ధాంత పోరులో పార్టీకి రాహుల్ సారథ్యం అనివార్యమని ముఖ్యంగా యువత, రైతులు,
ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీలు, పేదలు, అణగారిన వర్గాల తరఫున ఇంతకుముందు
మాదిరిగానే ఆయన పోరాడాలని ఏఐసీసీ ముక్తకంఠంతో కోరింది. ఈ రోజు దేశ రాజధానిలో
జరిగిన కీలక సమావేశానికి పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , ఏకేఅంటోని,
గులాంనబీ అజాద్, మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, చిదంబరం వంటి ముఖ్యనేతలు, సీఎంలు
అమరిందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాగ్వేల్ తదితరులు హాజరయ్యారు.
సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న
మమత వారించిన టీఎంసీ
పశ్చిమబెంగాల్
లో అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో రాష్ట్ర సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి
మమతా బెనర్జీ సిద్ధపడ్డారు. కోల్ కతాలోని కాళీఘాట్ లో గల తన నివాసం నుంచి మమతా
ఎన్నికల ఫలితాల్ని విశ్లేషించారు. తను సీఎంగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో పార్టీ
గెలుపునకు సమయం వెచ్చించలేకపోయినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తనకు
అడ్డుగోడగా నిలవడం వల్లే రాష్ట్రంలో బీజేపీ అనుకోనిరీతిలో పుంజుకోగల్గిందని అందువల్ల
రాజీనామా చేయాలని మమతా నిర్ణయం తీసుకున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
ఏకగ్రీవంగా మమతా రాజీనామా నిర్ణయాన్ని తిరస్కరించింది.