చక్కటి జీవనశైలి వ్యాయామంతో
మతిమరుపు దూరం: డబ్లూహెచ్ఓ
ప్రపంచాన్ని
ఆందోళనకు గురి చేస్తున్న తాజా ఆరోగ్య సమస్య డెమెన్షియా (చిత్తవైకల్యం- మతిమరుపు).
ప్రస్తుతం విశ్వ వ్యాప్తంగా అయిదు కోట్ల మంది (50మిలియన్లు) ఈ వ్యాధి బారిన
పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల ప్రకటించింది. ఏటా కోటి
మంది(10మిలియన్లు) కొత్తగా ఈ వ్యాధికి లోనవుతున్నారు. ఈ సమస్యకు చాలా సులభమైన
పరిష్కారాన్ని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ధూమపానం(స్మోకింగ్), మద్యపానం(డ్రింకింగ్)
మానేసి చక్కటి జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ డెమెన్షియా
దరిచేరదని పేర్కొంది. అంతేగాక పై చిట్కా ద్వారా ఊబకాయం, రక్తపోటు, మధుమేహ
వ్యాధులకు దూరంగా ఉండి గుండె, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధ్నామ్ గాబ్రియెసిస్
సూచించారు. తమ సంస్థ ఇప్పటికే బోస్నియా, హెర్జ్ గొవినా, క్రోయేసియా,ఖతర్,
స్లొవేనియా, శ్రీలంక తదితర దేశాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు.
డెమెన్షియా వ్యాధిని గుర్తించే పరీక్ష శిబిరాలు, చికిత్స తదితరాల పైన డబ్ల్యూహెచ్ఓ
దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. మరోవైపు ఆన్ లైన్ ద్వారా డెమెన్షియా
వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు డబ్యూహెచ్ఓ మానసిక ఆరోగ్య
పరిరక్షణ విభాగ డైరెక్టర్ డాక్టర్ డెవొరా కెస్టెల్ పేర్కొన్నారు. ఆన్ లైన్
కార్యక్రమాల ద్వారా ఎవరికి వారు తమ సమస్యను గుర్తించొచ్చని చెప్పారు. కుటుంబ సభ్యులు,
విధి నిర్వహణలో సహ సిబ్బందితో వ్యవహారశైలి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని
ముందస్తుగా డెమెన్షియా లక్షణాల్ని గుర్తించి తగు చికిత్స ద్వారా సమస్య నుంచి సులభంగా
బయటపడవచ్చని తెలిపారు.