హిమాలయాల్లో ఇద్దరు భారత పర్వతారోహకుల
మృతి..ఆచూకీ లేని ఐర్లాండ్ వాసి
హిమాలయ పర్వతారోహక బృందంలోని ఇద్దరు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. ఒక
ఐర్లాండ్ జాతీయుడి ఆచూకీ తెలియరావడం లేదు. శుక్రవారం(మే17) అధికారులు ఈ విషయాన్ని
తెలిపారు. దీంతో ఈ నెలలో మృతి చెందిన పర్వతారోహకుల సంఖ్య ఆరుకు చేరింది. నేపాల్
మీదుగా ప్రపంచంలోనే ఎత్తైన 14 పర్వత శిఖరాల్లో ఒకటైన మకాలు పర్వతారోహణకు వెళ్లిన
న్యూఢిల్లీకి చెందిన రవి ఠకర్(27), నారాయణ్ సింగ్(34) మృతి చెందగా డబ్లిన్ లో
టీచరయిన సీమస్ సీన్ లాలెస్(39) జాడ తెలియడం లేదు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్
ఏజెన్సీకి చెందిన థానేశ్వర్ గుర్గాయిన్ అందించిన వివరాల ప్రకారం మౌంట్ ఎవరెస్ట్
సౌత్ కోల్(శిఖర లోయ) శిబిరంలోనే ప్రాణాలు కోల్పోయిన రవి ఠకర్ ను కనుగొన్నారు.
అయితే అతని మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అననుకూల వాతావరణం కారణంగానే
అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మకాలు నుంచి తిరుగు ప్రయాణంలో నారాయణ్ సింగ్
అస్వస్థతకు గురై గురువారం మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి మిరా ఆచార్య తెలిపారు.
అతను ఉత్తరాఖండ్ కు చెందిన సైనికుడని తెలుస్తోంది. సాహసయాత్రలో ఉండగా గురువారం
సీమస్ కాలు జారి మంచులోయలోకి పడిపోయినట్లు సమాచారం.