సమాఖ్య కూటమి కల సాకారమయ్యేనా?
భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి రాజనీతిజ్ఞత కనబరిచిన నేతల్ని వేళ్ల మీదే లెక్కించొచ్చు. ప్రధానమంత్రులుగా ఆ పాత్రలో
ఒదిగిపోయి దేశ విదేశాల్లో కీర్తి పతాకను ఎగురువేసిన కొద్ది మందిలో ప్రథమ ప్రధాని
పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావు, ఎ.బి.వాజ్ పేయి
ముందువరుసలో నిలుస్తారు. కొద్ది కాలమే పరిపాలన సాగించిన లాల్ బహుదూర్ శాస్త్రి
విలువల రాజకీయాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఆ స్థాయి ప్రధాని దేశానికి కావాలని
దశాబ్దాల తరబడి భారత్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయం
కనిపిస్తోందా? అన్నదే ప్రశ్న. ఆ ప్రయత్నాలే ఇప్పడు మళ్లీ అధికారంలో ఉన్న, వస్తామని
భావిస్తున్న ప్రాంతీయ పార్టీల నాయకులు చేస్తుండడం ప్రశంసార్హం. గత సార్వత్రిక
ఎన్నికల్లో ఒంటి చెత్తో భారతీయ జనతా పార్టీని ఢిల్లీ గద్దెనెక్కించిన ఘనత నరేంద్రమోదీదే.
అత్యున్నత ప్రధానమంత్రి కుర్చీలోకి వచ్చిన మోదీ ఆ తర్వాత ఎన్డీయే లోని మిత్ర
పక్షాలకు కూడా దూరమయ్యారు. మళ్లీ తాజా సార్వత్రిక ఎన్నికల నాటికే వారితో సయోధ్య
కుదర్చుకోగలిగారు. పరిపాలనలో మెరుపులు మాటెలా ఉన్నా మరకలుగా పెద్ద నోట్ల రద్దు
అంశం, జీఎస్టీ బీజేపీనే కలవరపాటుకు గురి
చేశాయి. నోట్ల రద్దు నేపథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏటీఎం క్యూల్లో నిలబడి 100
మందికి పైగా మృతి చెందడం అత్యంత అపకీర్తిని తెచ్చిపెట్టింది. జీడీపీ కుంగిపోయి
ద్రవ్యోల్బణం పెంపునకు బాటలు పరిచింది. మహిళలు బంగారం లెక్కలు చెప్పాలని, రశీదులు
చూపాలని కోరి మళ్లీ వెనకడుగు వేశారు. అలాగే బ్యాంక్ ల పరిపుష్టి పేరుతో జనం డిపాజిట్లను బాండ్లుగా మార్చే యోచన(ఎఫ్.ఆర్.డి.ఐ
బిల్లు) మోదీ అంటేనే జనానికి భయాన్ని కల్గించింది. జీఎస్టీ అమలు (స్లాబ్ ల సవరణలతో)తదితరాలతో
సామాన్యులు, వ్యాపారులకు ఇబ్బందులు
తెచ్చిపెట్టింది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగాల్సిన సమాఖ్య స్ఫూర్తికి మోదీ పాలన తూట్లు పొడుస్తోందని పలు రాష్ట్రాలు
గగ్గోలు పెట్టాయి. ఈ పరిణామాల వల్లే సమాఖ్య కూటమి ఆలోచన మొగ్గతొడిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, తమిళనాడు ప్రతిపక్ష డీఎంకె నేత స్టాలిన్
భేటీ ఈ కోణంలోనే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమాఖ్య కూటమి ఏర్పాటు దిశగా ఈ
అంశాన్ని భుజాలకెత్తుకున్న కేసీఆర్ ప్రయత్నాలు ఆయనే చెప్పినట్లు ఎన్నికల ఫలితాల
తర్వాత జోరందుకోవచ్చు. ప్రత్యామ్నాయం అవసరమైన నాడు కాంగ్రెస్ యేతర, బీజీపీ యేతర
కూటమి కచ్చితంగా భారత ప్రధాని పీఠం వైపు చురుగ్గా కదులుతుంది. దేశంలో
స్వాతంత్ర్యానంతరం రాకాసి సమస్యగా కనీస సౌకర్యాల లేమి ఇంకా పీడిస్తూనే ఉంది. అందుకు
విరుగుడుగా అందరికీ కనీస సౌకర్యాలు అందేటటువంటి కేసీఆర్ మోడల్ ప్లాన్, విజన్
ముమ్మాటికి అక్కరకు వస్తాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సమాఖ్య కూటమి
ప్రయత్నాలు మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఏన్డీయే కూటమికే లబ్ధి చేకూరుస్తాయా? అనే
మూలంలోని లోగుట్టును ప్రాంతీయ పార్టీల నేతలు పరిగణనలోకి తీసుకోవాలి.
పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, కేరళలో
అధికారంలో ఉన్న వామపక్ష భాగస్వామ్య కూటమి నేత విజయన్, తాజాగా తమిళనాడులో ఈసారి
లోక్ సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించవచ్చని భావిస్తున్న డీఎంకె అధినేత స్టాలిన్ లతో
చర్చలు జరిపామనడం వరకు బాగానే ఉంది. అయితే వీరంతా కేంద్రంలో యూపీఏ పక్షాలవారే. ఎన్డీయే
లో అయిదేళ్లగా ఇబ్బందుల పడ్డ ఆ కూటమి పార్టీలతో కూడా ఈపాటికే చర్చలు విస్తృతంగా
సాగాలి. ఎవరితో చర్చలు జరిపామో, జరుపుతున్నామో అన్నీ ముందే వెల్లడించం కదా అని కేసీఆర్
వ్యాఖ్యానించారు. కాబట్టి ఆయన ఆ కూటమిలోని అసంతృప్తులతోనూ చర్చలకు అంకురార్పణ
చేసినట్లుగానే భావించాలి. వాస్తవానికి ఒక అద్భుతమైన స్థిరమైన లక్ష్యంతో చేపట్టిన
బృహత్తర కార్యక్రమమది. దేశ రాజకీయాల్ని మలుపుతిప్పే కోట్ల మంది సాధారణ ప్రజల్లో
ఆశలు చిగురింపజేసే మహత్కార్యం.
మహారాష్ట్రలో శివసేన, ఒడిశాలో బిజూజనతాదళ్, బిహార్ లో జనతాదళ్ యునైటెడ్
ఎన్డీయే కూటమితో పలు సందర్భాల్లో పొసగక బహిరంగంగానే బీజేపీపై ధ్వజమెత్తాయి. అదీ
ఇప్పటి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల వరకు ఆ పార్టీలు బీజేపీ వైఖరిపై కినుక
వహించాయి. సమాఖ్య కూటమి ఏర్పాటుకు తపిస్తున్న నేతలు ఆ పార్టీలతో ఏ మేరకు సత్సంబంధాలు
నెరిపారో తెలియాలి. దక్షిణాదిలో బీజేపీకి బలం దాదాపు లేనట్లే. హిందీ బెల్ట్ గా
చెప్పుకునే అత్యధిక లోక్ సభ నియోజకవర్గాలు గల 10 రాష్ట్రాల్లోని ప్రాంతీయ
పార్టీలతో సమాఖ్య కూటమి విస్తృత చర్చలు చేపట్టాలి. సమాఖ్య కూటమి అడుగులు ఈ ఎన్నికల
తర్వాత పెద్దగా ముందుకు పడకపోయినా ఈ ఆలోచన మున్ముందు సాకరమయ్యే అవకాశం నూటికి
నూరుపాళ్లు ఉంది.