పాకిస్థాన్ స్టార్ హోటల్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తి
పాకిస్థాన్ నావికాదళ భద్రతా
బలగాలు పెర్ల్ కాంటినెంట్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తయిందని ఆదివారం (మే12) ప్రకటించాయి.
శనివారం ఉదయం 5 సమయంలో హోటల్ లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని కాల్చి వేసిన
సంగతి తెలిసిందే. సముద్ర తీర నగరం గ్వదర్ లో భద్రతా బలగాలు తనఖీలు నిర్వహిస్తూ ఉగ్రవాదుల
ఉనికిని కనుగొన్నాయి. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు
వారు ముగ్గురు హోటల్ సిబ్బందిని కాల్చి చంపారు. హోటల్ లో ప్రవేశిస్తున్న
ఉగ్రవాదుల్ని గార్డు అడ్డుకోగా అతణ్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పాక్
నావికాదళానికి చెందిన భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా హోటల్ మెట్ల దారిలో నక్కిన ఉగ్రవాదులు
కాల్పులు ప్రారంభించారు. దాంతో ఎదురు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని
మట్టుబెట్టారు. ఈ దాడి తమ పనేనని `మజీద్ బ్రిగేడ్ బలూచిస్థాన్ లిబరేషన్
ఆర్గనైజేషన్` ట్విటర్ లో పేర్కొంది. ఇదే గ్రూపు గత ఏడాది కరాచిలోని చైనా రాయబార
కార్యాలయంపై దాడి చేసింది. బలూచ్ జిల్లాలోని చాగై లోనూ చైనా ఇంజినీర్లపై దాడి
చేశారు. పాక్ లో అత్యంత పేదరికం ఉన్న ప్రావిన్స్ అయిన గ్వదర్ లో సహజవనరులు అపారంగా
ఉన్నాయి. సహజవాయువుతో పాటు, అపారమైన ఖనిజ సంపద అక్కడ ఉంది. అరేబియా సముద్రంలో
గ్వదర్ వ్యూహాత్మక ఓడరేవు ప్రాంతం. చైనా పాకిస్థాన్ దేశాల ఎకనామిక్ కారిడర్ అభివృద్ధి
ప్రాజెక్ట్ లో భాగంగా రూ.41వేల9వందల కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. చైనా ఈ కారిడార్
లో రహదారి నిర్మాణానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే ఏడాది కాలంగా
ఇక్కడ ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో గ్వదర్ నుంచి కరాచికి వెళ్లున్న
బస్సులపై ఉగ్రవాదులు దాడులు చేసి 14 మందిని పొట్టనబెట్టుకున్నారు. పెర్ల్
కాంటినెంటల్ లో ఎక్కువగా విదేశీ పర్యాటకులు బస చేస్తుంటారు. అలాగే ప్రాజెక్టుకు
సంబంధించిన చైనా సిబ్బంది ఎక్కువగా ఇదే హోటల్ లో ఉంటుంటారు. అయితే తాజా
ఎదురుకాల్పుల సమయంలో వీరెవరు ఆ హోటల్ లో లేనట్లు సమాచారం.