వియత్నాంతో భారత్
రూ.లక్ష కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా అడుగులు
భారత
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల వియత్నాం పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ నేతల్ని కలుసుకున్నారు. ఆయన వియత్నాం వైస్ ప్రెసిడెంట్ డాంగ్ థి న్యాగో థిన్, ప్రధానమంత్రి
నగైయెన్ జువాన్ ఫాక్ తదితర నేతలతో భేటీ అయ్యారు. ఈ
సందర్భంగా ఉభయ దేశాల నేతలు ద్వైపాక్షిక వాణిజ్యం, రాజకీయ, రక్షణ, భద్రత తదితర
అంశాలపై చర్చలు జరిపారు. భారత్, వియత్నాంలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని
మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించాయి. న్యాగోథిన్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా
వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆగ్నేయాసియా (ఏషియాన్)లో భాగస్వామ్య దేశాలైన భారత్,
వియత్నాంలు 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.లక్షా 4వేల కోట్ల (15బిలియన్
డాలర్లు) స్థాయికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాదిగా ఉభయ దేశాలు
రూ.94 వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. 2007 నుంచి ఇరు దేశాల
మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో ఉండగా ద్వైపాక్షిక వాణజ్యం రూ.54వేల కోట్ల
స్థాయిలో జరిగింది. ప్రత్యేకించి ఈ ఏడాది నుంచి ఐ.టి.రంగం, ఎనర్జీ, పునరుత్పాదక
శక్తి రంగం, మౌలికసౌకర్యాలు, ఆధునిక వ్యవసాయం, ఆయిల్, గ్యాస్ ఉత్పాదన తదితర
రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించాయి.