Tuesday, May 7, 2019

amith shah calls modi 'arjuna' to counter priyanka's 'duryodhana' remark on modi


ప్రియాంక జీ.. మీకు మే23 తర్వాత తెలుస్తుంది
కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీపై భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడికి దిగారు. మంగళవారం (మే7) హర్యానాలోని అంబాలాలో ప్రియాంక ఎన్నికల ప్రచార సభలో మోదీ అహంకారాన్ని దుర్యోధనుడి అహంకారంతో పోలుస్తూ వ్యాఖ్యానించిన కొన్ని క్షణాల్లోనే బీజేపీ నాయకులు, శ్రేణులు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. అధ్యక్షుడు అమిత్ షా అయితే ఒకడుగు ముందుకు వేసి మే 23 తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు తెలుస్తుందంటూ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ లోని బెల్దా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ   ‘ప్రియాంక జీ.. ప్రధాని మోదీని దుర్యోధనుడితో పోల్చారు.. ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు వారే మీకు గుణపాఠం  చెబుతారు..’అని గట్టిగా బదులిచ్చారు. మోదీ అర్జునుడని 2019 ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

protest over clean chit to cji in sexual harassment case


సీజేఐకు క్లీన్ చిట్ పై మహిళల నిరసన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగొయ్ కి అంతరంగిక విచారణ సంఘం క్లీన్ చిట్ ఇవ్వడంపై మహిళలు నిరసనకు దిగారు. మంగళవారం (మే7) సుప్రీంకోర్టు ఆవరణలో పలువురు మహిళలు, న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కనీసం విచారణ సంఘం ముందుకు బాధితురాల్ని హాజరుకానివ్వలేదని ఆరోపించారు. ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అత్యంత ప్రముఖులు తిరిగే ప్రాంతం(వి.వి.ఐ.పి  జోన్) కావడం వల్ల ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉల్లంఘించిన పలువురు ఆందోళన కారుల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. విధివిధానాలు పూర్తయ్యాక పోలీసులు వారిని విడిచిపెట్టారు.

anti cji sexual harassment charge refuse to subside


సీజేఐకు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీని కోరిన ఫిర్యాదుదారు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై వచ్చిన లైంగిక ఆరోపణల పర్వానికి తెరపడినట్లు కనపడ్డం లేదు. తాజాగా ఫిర్యాదుదారైన న్యాయస్థానం మాజీ ఉద్యోగిని ముగ్గురు సభ్యుల అంతరంగిక విచారణ సంఘం సీజేఐకు క్లీన్ చిట్ ఇస్తూ నివేదించిన కాపీని కోరారు. సీజేఐ రంజన్ గొగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగిని మంగళవారం (మే7) తన ఫిర్యాదులో ఆధారాల్లేవని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదిక కాపీని తనకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే, న్యాయమూర్తులు ఇందిరాబెనర్జీ, ఇందు మల్హొత్రాల విచారణ సంఘం సీజేఐకు క్లీన్ చిట్ ఇస్తూ సంక్షిప్తంగా పేర్కొన్న నివేదిక కాపీలను సీజేఐ, తదుపరి సీనియర్ న్యాయమూర్తిలకు మాత్రమే ఇచ్చారు. అంతరంగిక విచారణ అయినందున నివేదికను ప్రజలకు బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని విచారణ బృందం పేర్కొన్న నేపథ్యంలో ఫిర్యాదుదారు తన ఆరోపణల్లో ఆధారాల్లేవనడాన్ని ప్రశ్నిస్తూ  కాపీని కోరడం న్యాయవ్యవస్థకు సంబంధించిన వర్గాల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

sc allows karti chidambaram to travel abroad in may


కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు ఎస్సీ అనుమతి
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులను ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు మంగళవారం (మే7)అనుమతి ఇచ్చింది. ఈ నెలలో కార్తీ అమెరికా, జర్మనీ, స్పెయిన్ పర్యటనలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతి కోరుతూ అభ్యర్థించారు. ప్రస్తుత పరిస్థితుల్ని అంచనా వేసిన మీదట కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం కొడుకయిన కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జనవరిలో రూ.10 కోట్లను డిపాజిట్ చేసినట్లు సుప్ర్రీంకోర్టు సెక్రటరీ జనరల్ తెలిపారు. అప్పుడే కార్తీకి సుప్రీం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే విదేశాలకు వెళ్లి తిరిగి రావాలని, కేసుల విచారణలో సహకరించాలని మాత్రం ఆంక్షలు విధించింది. ఈ మేరకు కోర్టుకు కార్తీ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా హవాలా కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ ఫిబ్రవరి 28, 2018లో అరెస్ట్ చేసింది. అక్రమ నగదు బదిలీలకు సంబంధించి ఈడీ కేసుల్ని ఆయన ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.