గువాహటిలో చొరబడిన అడవి ఏనుగు స్తంభించిన ట్రాఫిక్
గువాహటి నగరంలోకి
మంగళవారం (ఏప్రిల్ 30) అడవి ఏనుగు చొచ్చుకువచ్చి అలజడి సృష్టించింది. ఇక్కడకు
కేవలం 9 కిలోమీటర్ల సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. అందులో నుంచి స్థానిక
జి.ఎస్.రోడ్డులోకి ఏనుగు ప్రవేశించింది. సమీపంలోనే రాష్ట్ర సచివాలయం, ఇతర ప్రధాన
ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. దాంతో మంగళవారం సాయంత్రం ఏనుగు నగరంలోకి చొరబడే సమయానికి
పెద్ద సంఖ్యలో జనం రోడ్లపై ఉండడంతో కలకలం రేగింది. గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం
కల్గింది. రోడ్డుపై ఏనుగు తిరుగుతుంటే పలువురు సెల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు.
ఏనుగు అమ్చాంగ్ ప్రాంతం నుంచి సుమారు 25 కిలోమీటర్లు నడచుకుంటూ గువాహటి లోకి
వచ్చినట్లు భావిస్తున్నారు. ఆహారం లేదా
నీటి కోసమే ఏనుగు ఇలా నగరంలోకి వచ్చి ఉంటుందని తెలుస్తోంది. వెంటనే జూ సిబ్బంది,
అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగును మళ్లీ అడవిలోకి పంపడానికి
చేసిన ప్రయత్నాలు రాత్రి వరకు ఫలించలేదు. ఏనుగు సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో తిష్ఠ
వేసింది. అటవీశాఖ మంత్రి పరిమల్ సుక్లాబైధ్య మాట్లాడుతూ ఏనుగును అడవిలోకి తిరిగి
పంపడానికి ఈ రాత్రి చర్యలు చేపడతామని చెప్పారు. ఏనుగు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చనే
ట్రాంక్విలైజర్ ద్వారా మత్తు ఇచ్చే ఆలోచనను విరమించుకున్నామన్నారు.