‘చౌకీదార్ చోర్ హై’ అంశంపై మరోసారి విచారం వ్యక్తం చేసిన రాహుల్
చౌకీదార్ చోర్ హై అంశం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని
వీడ్డం లేదు. సుప్రీంకోర్టులో ఆయన తాజా అఫిడవిట్ దాఖలు చేస్తూ ఎన్నికల ప్రచార
వేడిలో రాఫెల్ ఒప్పందంపై స్పందిస్తూ కావలి వాడే దొంగ(చౌకీదార్ చోర్ హై) అని చేసిన
వ్యాఖ్యలపై మరోసారి విచారం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీపై
బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. గతంలో రాహుల్ సుప్రీంకు ఈ విషయమై
సమాధానమిస్తూ ప్రచార పర్వంలో యథాలాపంగా చౌకీదార్ చోర్ హై అనే మాటలు వాడినట్లు
తెలిపారు. ఆ మాటలు తప్పుడు అన్వయానికి దారితీయడం పట్ల విచారం వ్యక్తం
చేస్తున్నట్లు అఫిడవిట్ లో స్పష్టం చేశారు. అయితే రాహుల్ ‘విచారం’ వ్యక్తం
చేస్తున్నట్లు చాలా సింపుల్ గా తప్పించుకోజూడ్డం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని
మీనాక్షి మరోసారి సుప్రీం దృష్టికి తెచ్చారు. దాంతో రాహుల్ తాజా అఫిడవిట్ ఇస్తూ ‘విచారం
వ్యక్తం చేస్తున్నా’ అనే మాటల్నే పునరుద్ఘాటించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు
ఒప్పందంలో దేశ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ తప్పుబడుతూ పెద్ద ఎత్తున అవినీతి
ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చౌకీదార్ గా తనను తాను చెప్పుకునే మోదీని
ఉద్దేశిస్తూ అనేక వేదికలపై నుంచి చౌకీదార్ చోర్ హై అని రాహుల్ ఎదురుదాడి ప్రారంభించారు.
రాఫెల్ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది రాహుల్ ఆరోపణల సారాంశం. అయితే
ఈ అంశం సుప్రీం కోర్టు చెంతకు చేరడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. రాహుల్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో తమ రాజకీయ ప్రత్యర్థులే
చౌకీదార్ చోర్ హై మాటలకు తప్పుడు అన్వయాన్నిచ్చి తనపై దుష్ప్రచారాన్ని
చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో తను కోర్టు ధిక్కరణకు పాల్పడిందే లేదని రాహుల్ స్పష్టం చేశారు.