అమిత్ షా ‘ఇలు ఇలు’ కామెంట్లపై
కాంగ్రెస్ ధ్వజం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు అమిత్ షా.. కాంగ్రెస్
అధినాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చేసిన ఇలు ఇలు కామెంట్ల పై ఆ పార్టీ
ధ్వజమెత్తింది. అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్26) జలోర్ లో ఎన్నికల సభలో మాట్లాడుతూ
కాంగ్రెస్ నేత రాహుల్ కు ఉగ్రవాదులతో ఇలు ఇలు (ఐ లవ్ యూ – ప్రాచుర్యం పొందిన హిందీ సినిమా పాట) సంబంధముందంటూ
వ్యాఖ్యలు చేశారు. 1999లో బీజేపీయే జైల్లోని ఉగ్రవాదుల్ని కాందహార్ కు తీసుకెళ్లి
మరీ అప్పగించిందని గుర్తు చేస్తూ అమిత్ షాపై రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్
ప్రధానకార్యదర్శి అవినాశ్ పాండే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్ఘానిస్థాన్ కు
విమానాన్ని హైజాక్ చేసుకుని వెళ్లి ఉగ్రవాదులు డిమాండ్ చేయడంతో నాటి ఎన్డీయే
ప్రభుత్వం వాళ్లు కోరిన విధంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మసూద్ అజర్ సహా ముగ్గురు
కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అప్పగించిన సంగతి తెలిసిందే. బీజేపీలోని మోదీ, అమిత్ షా సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు లేదా వారి
కుటుంబసభ్యులు ఎవరైనా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడారా? అని
ప్రశ్నించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ,
రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ
వ్యవస్థల్ని మోదీ ప్రభుత్వం బలహీన పరుస్తోందన్నారు. సోషల్ మీడియాను వారు దుర్వినియోగం
చేస్తున్నారని అవినాశ్ ఆరోపించారు. మరో 50 ఏళ్లు దేశాన్ని తామే పరిపాలిస్తామని
మోదీ, అమిత్ షాలు గతంలో పేర్కొన అంశాన్ని ప్రస్తావిస్తూ
ఆయన రాజ్యాంగం ఎంతటి ప్రమాదంలో పడిందో గమనించాలని
ప్రజల్ని కోరారు.