వారణాసి లో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)
తరఫున వారణాసి లోక్ సభ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్ 26) నామినేషన్ దాఖలు చేశారు.
మరోసారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న మోదీ గురువారం భారీ రోడ్ షో నిర్వహించిన
సంగతి తెలిసిందే. వారణాసి కలెక్టరేట్ లో
ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఏన్డీయే భాగస్వామ్య పక్ష నేతలు, పార్టీ సీనియర్
నాయకులు పాల్గొన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శిరోమణి అకాలీదళ్ నేత
ప్రకాశ్ సింగ్ బాదల్, శివసేన అగ్రనేత ఉద్దవ్ థాకరే, అన్నాడీఎంకె నాయకులు పన్వీర్
సెల్వం, ఎం.తంబిదురై, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్
గడ్కరీ తదితరులు మోదీ వెంట ఉన్నారు. మోదీ నామినేషన్ ను నల్గురు ప్రతిపాదించినట్లు
కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలుకు ముందు మోదీ కాలభైరవ ఆలయాన్ని
సందర్శించారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
మరో అయిదేళ్లు తనను ఎన్నుకోవడానికి వారణాసి వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని
మోదీ అన్నారు. నేను, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, యోగి ఆధిత్య నాథ్ కేవలం
కరసేవకులం మాత్రమేనన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్ని ఓటర్లే ప్రతిపక్షాలతో
పోరాడుతున్నాయని మోదీ అన్నారు. నిన్నటి రోజున వారణాసి రోడ్డు షో కు హాజరైన అశేష జన
వాహినే అందుకు సాక్ష్యంగా పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ అనుకూల పవనాలు
వీస్తున్నాయని మళ్లీ మోదీజీ పాలన అందిస్తారని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం
చేశాయి.