న్యూజిలాండ్ ప్రధానికి బ్రిటన్ రాకుమారుడు శుభాకాంక్షలు
బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్ గురువారం (ఏప్రిల్25) న్యూజిలాండ్ పర్యటనకు
వెళ్లారు. ఆక్లాండ్లో ప్రధాని జకిండా అర్డెర్న్ తదితరులు విలియమ్స్ కు ఘన స్వాగతం
పలికారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ తరఫున సంప్రదాయ మావోరి (ముక్కు- ముక్కు రాసుకునే పండుగ) శుభాకాంక్షల్ని ప్రధాని అర్డెర్న్ కు
విలియమ్స్ తెలియజేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విలియమ్స్ అంజక్
డే(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యుద్ధ వీరులు, శాంతికాముకుల స్మారక దినోత్సవం)
వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో విలియమ్స్ స్మారక
స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె.
జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రధాని అర్డెర్న్ తో కలిసి విలియమ్స్ పౌర
సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెల్లింగ్టన్ లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్
రాణి నిలువెత్తు చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా గత నెలలో క్రైస్ట్
చర్చి మసీదుల్లో జరిగిన బాంబు దాడుల్లో గాయపడిన వారిని ఆయన ఆసుపత్రులకు వెళ్లి పరామర్శంచనున్నారు.
క్రైస్ట్ చర్చి దాడుల్లో 50 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో
క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడంలో బ్రిటన్, న్యూజిలాండ్ చక్కటి
సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని ప్రధాని అర్డెర్న్ పేర్కొన్నారు.