Thursday, April 25, 2019

pm narendra modi arrives at dashashwamedh ghat for ganga aarti


వారణాసిలో మోదీ రోడ్ షో ధూంధాం
ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్26) ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ఒకరోజు ముందు అట్టహాసంగా గురువారం ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ రోడ్ షోకు పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు. మోదీ.. మోదీ.. అంటూ పలుచోట్ల నినాదాలు మిన్నంటాయి. ఆయన వెంట ఎన్డీయే నాయకులు, బీజేపీ నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  బీజేపీ  అధ్యక్షుడు అమిత్ షా, పియూష్ గోయల్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితర పార్టీ అగ్ర నాయకులతో పాటు, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, బిహార్ సీఎం నితిశ్ కుమార్, లోక్ జన్ శక్తి అగ్రనేత రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు రోడ్ షో లో మోదీ వెంట ఉన్నారు. అనంతరం మోదీ దశాశ్వమేథ్ ఘాట్ వద్ద గంగా హారతికి హాజరయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ రాయ్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి బరిలో నిలుస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ గురువారం తమ అభ్యర్థిగా అజయ్ రాయ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. 2014లోనూ రాయ్ వారణాసి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడో స్థానంలో 75,614 ఓట్లు సాధించారు. మోదీ రికార్డు స్థాయిలో 5,81,022 ఓట్లు పొందగా ఆయనకు పోటీగా నిలిచిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  2,09,238 ఓట్లతో రెండో స్థానాన్ని పొందారు.


william receives traditional maori greeting from new zealand pm jacinda ardern


న్యూజిలాండ్ ప్రధానికి బ్రిటన్ రాకుమారుడు శుభాకాంక్షలు

బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్ గురువారం (ఏప్రిల్25) న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఆక్లాండ్లో ప్రధాని జకిండా అర్డెర్న్ తదితరులు విలియమ్స్ కు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ తరఫున సంప్రదాయ మావోరి (ముక్కు- ముక్కు రాసుకునే పండుగ) శుభాకాంక్షల్ని ప్రధాని అర్డెర్న్ కు విలియమ్స్ తెలియజేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విలియమ్స్ అంజక్ డే(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యుద్ధ వీరులు, శాంతికాముకుల స్మారక దినోత్సవం) వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో విలియమ్స్ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె. జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రధాని అర్డెర్న్ తో కలిసి విలియమ్స్ పౌర సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెల్లింగ్టన్ లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి నిలువెత్తు చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా గత నెలలో క్రైస్ట్ చర్చి మసీదుల్లో జరిగిన బాంబు దాడుల్లో గాయపడిన వారిని ఆయన ఆసుపత్రులకు వెళ్లి పరామర్శంచనున్నారు. క్రైస్ట్ చర్చి దాడుల్లో 50 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడంలో బ్రిటన్, న్యూజిలాండ్ చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని ప్రధాని అర్డెర్న్ పేర్కొన్నారు.

rupee tumbles 22 paise against dollar on crude concerns


రూపాయి 22 పైసల పతనం 70.08 డాలర్ తో మారకం
భారత్ రూపాయి తాజాగా గురువారం(ఏప్రిల్25) 22 పైసలు పతనమైంది. ఫారెక్స్ (ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్) మార్కెట్ ప్రకారం డాలర్ తో మారకంలో 70.08 పలుకుతోంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ కు డిమాండ్ రావడం ఇందుకు కారణం.  బుధవారం కూడా రూపాయి 24 పైసలు పతనమై డాలర్ తో మారకంలో 69.86 వద్ద నిలిచింది. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ద్రవ్యోల్బణమూ రూపాయి పతనానికి కారణంగా భావిస్తున్నారు. ఇలాగే ముడి చమురు ధరలు పెరుగుదల కొనసాగితే ఆ ప్రభావం ఆయా దేశాల కరెన్సీ విలువలు మరింత దిగజారే ప్రమాదముంది.

Wednesday, April 24, 2019

ec orders removal of mamata`s biopic trailer


మమతా బయోపిక్ ట్రైలర్ నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ నాయకుల బయోపిక్ ల గోల కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈసీ పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ జీవిత గాథపై నిర్మితమైన బాఘిని సినిమా ట్రైలర్ ప్రసారాల్ని నిలిపివేస్తూ బుధవారం (ఏప్రిల్ 24) ఉత్తర్వులచ్చింది. ఆ సినిమా నిర్మాతలకు దీంతో పెద్ద షాక్ తగిలినట్టయింది. ఈ విషయమై మమతా ట్విట్ చేస్తూ ‘ఏమిటీ బాఘిని ట్రైలర్ రచ్చ.. ఆ సినిమాకు నాకూ సంబంధం లేదు. ఔత్సాహికులు కథ సిద్ధం చేసుకుని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినిమా తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు నాకు ముడిపెడుతూ అబద్ధాలు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఆమె హెచ్చరించారు. అంతకుముందు సీపీఐ(ఎం), బీజేపీ ఈ సినిమా నిలిపివేత గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) విన్నవించాయి. బాఘిని సినిమా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్లు ఆ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను నిలిపివేస్తూ ఈసీ  ఆదేశాలు జారీ చేసింది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన ఓ వ్యక్తి స్ఫూర్తివంతమైన యథార్థ గాథగా మాత్రమే బాఘినిని తెరకెక్కించినట్లు ఈ సినిమా నిర్మాతలు పేర్కొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఈ బయోపిక్ తీశారని బీజేపీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మోదీ బయోపిక్ విడుదలను వ్యతిరేకించిన మమతా బెనర్జీ తన జీవితగాథ చిత్రంపై వ్యవహరిస్తున్న తీరును బట్టే ఆమె నైజం తేటతెల్లమౌతోందని విమర్శించింది. మరోవైపు బాఘిని నిర్మాతలు తమ చిత్రం మే3న విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిశాకే మోదీ బయోపిక్ విడుదలని ఈసీ ఇంతకుముందే ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం బాఘిని విడుదల కూడా లేనట్లే స్పష్టమౌతోంది.