మమతా బయోపిక్ ట్రైలర్ నిలిపివేస్తూ ఈసీ ఉత్తర్వులు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ నాయకుల బయోపిక్ ల గోల కొనసాగుతూనే ఉంది.
తాజాగా ఈసీ పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ జీవిత గాథపై నిర్మితమైన బాఘిని సినిమా
ట్రైలర్ ప్రసారాల్ని నిలిపివేస్తూ బుధవారం (ఏప్రిల్ 24) ఉత్తర్వులచ్చింది. ఆ
సినిమా నిర్మాతలకు దీంతో పెద్ద షాక్ తగిలినట్టయింది. ఈ విషయమై మమతా ట్విట్ చేస్తూ
‘ఏమిటీ బాఘిని ట్రైలర్ రచ్చ.. ఆ సినిమాకు నాకూ సంబంధం లేదు. ఔత్సాహికులు కథ సిద్ధం
చేసుకుని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సినిమా తీసుకున్నారు’ అని
పేర్కొన్నారు. ఈ సినిమాకు నాకు ముడిపెడుతూ అబద్ధాలు ప్రచారం చేసిన వారిపై పరువు
నష్టం దావా వేస్తానంటూ ఆమె హెచ్చరించారు. అంతకుముందు సీపీఐ(ఎం), బీజేపీ ఈ సినిమా నిలిపివేత గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ)
విన్నవించాయి. బాఘిని సినిమా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా జీవిత
కథ ఆధారంగా తెరకెక్కినట్లు ఆ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్
ను నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలు జారీ
చేసింది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన ఓ వ్యక్తి స్ఫూర్తివంతమైన యథార్థ
గాథగా మాత్రమే బాఘినిని తెరకెక్కించినట్లు ఈ సినిమా నిర్మాతలు పేర్కొంటున్నారు. ఎన్నికల
షెడ్యూల్ విడుదలయ్యాక ఈ బయోపిక్ తీశారని బీజేపీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మోదీ బయోపిక్ విడుదలను వ్యతిరేకించిన మమతా బెనర్జీ తన జీవితగాథ చిత్రంపై వ్యవహరిస్తున్న
తీరును బట్టే ఆమె నైజం తేటతెల్లమౌతోందని విమర్శించింది. మరోవైపు బాఘిని నిర్మాతలు
తమ చిత్రం మే3న విడుదలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికలు
ముగిశాకే మోదీ బయోపిక్ విడుదలని ఈసీ ఇంతకుముందే ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం బాఘిని విడుదల కూడా లేనట్లే స్పష్టమౌతోంది.