అవును..పవన్ తో గొడవయిందన్న అలీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో
గొడవ అయిన మాట నిజమేనని హాస్యనటుడు అలీ అంగీకరించాడు. ఇటీవల ‘ఆలీతో సరదాగా’ అనే
టీవీ షోకు వచ్చిన పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ నవ్వుతూ ఎదురుప్రశ్న వేశారు. సరదాగా
అడుగుతున్నట్లున్నా నిజానికి నేను ఓ సీరియస్ ప్రశ్న వేస్తున్నానంటూ ఆమె అలీతో `మీకు
కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?` అని
సూటిగా అడిగారు. వెంటనే అలీ కూడా తడుముకోకుండా అవును..నిజమేనంటూ ఠకీమని
సమాధానమిచ్చాడు. బాల నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అలీ నాలుగు
దశాబ్దాలుగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి వచ్చాక ఆయనతోను కలిసి నటిస్తూ సన్నిహితమయ్యాడు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా వీరిద్దరూ మంచి
మిత్రులుగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని చాలా ఏళ్లగా అలీ ఎదురుచూస్తున్నారు. ఈ
నేపథ్యంలో అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు పవన్ కల్యాణ్‌తో ఏపీ
సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. అలీ అలా వైఎస్ఆర్ సీపీలో చేరగానే
`అసలు ఎవరినీ నమ్మాలో నమ్మకూడదో తెలియడం లేదు` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అలీ లాంటి
వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేశాడని పవన్
తీవ్రంగా ఆరోపించారు. అలీ కూడా ఆ ఆరోపణల్ని గట్టిగానే తిప్పికొట్టారు. పవన్ తనకు
ఆర్థికంగా ఏదైనా సాయం చేశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు.