Monday, April 15, 2019

sc directs ec to watch pm modi biopic full movie submit decision in sealed cover


మోదీ బయోపిక్ సినిమా చూసి సీల్డ్ కవర్లో నివేదికివ్వండి
·    ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ప్రధాని మోదీపై నిర్మించిన బయోపిక్ సినిమాను పూర్తిగా చూశాక నివేదికను తమకు సీల్డ్ కవర్ లో పంపాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. మోదీ బయోపిక్ సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ప్రదర్శించరాదని ఈసీ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయంపై స్టే విధించాలని ఆ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను సోమవారం(ఏప్రిల్15) ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఈ మేరకు తీర్పిచ్చింది. కేవలం సినిమా ప్రోమోలను చూసి ఈసీ నిషేధం నిర్ణయాన్ని అమలు చేయడం తగదని నిర్మాతల తరఫున న్యాయవాది ముకుల్ రోహ్టగి వాదించారు. శుక్రవారం (ఏప్రిల్19) లోపుగా నివేదికను తమకు అందజేయాలని కోరింది. ఈనెల 22 న (సోమవారం) మోదీ బయోపిక్ పై తుది తీర్పు వెలువడనుంది.



Sunday, April 14, 2019

jet airways crisis deepens no flight from monday


జెట్ విమానాలు నేటి నుంచి బంద్
·   ఎయిర్ వేస్ సంక్షోభం తీవ్రతరం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ పైలట్ల విధులు బహిష్కరణ ప్రకటనతో మరో సమస్యలోకి జారుకుంది. దాంతో సోమవారం (ఏప్రిల్15) నుంచి జెట్ విమానాలు ఎగరబోవడం లేదని తెలిసింది.  నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్.ఎ.జి) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్ఏజీలో 1100 మంది పైలట్లు సభ్యులుగా ఉన్నారు. ఒక్క జెట్ ఎయిర్ వేస్ లోనే 1600 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. పైలట్లతో పాటు జెట్ ఇంజినీర్లు, సీనియర్ మేనేజర్లు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి నుంచి వీరందరికీ జీతాలు అందడం లేదని సమాచారం. అయితే జెట్ యాజమాన్యం సంస్థ మనుగడను కాపాడ్డానికి ప్రాథమిక పెట్టుబడిగా ఎస్.బి.ఐ నుంచి రూ.1500 కోట్ల రుణ మంజూరు కోరింది. జెట్ సిబ్బంది అందరికీ ఆ మొత్తం రాగానే బకాయిలన్నీ చెల్లిస్తామని నచ్చజెబుతూ వచ్చింది. అయితే ఆ ప్రణాళికా బెడిసికొట్టిన మీదట జెట్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. సంక్షోభానికి ముందు జెట్ సంస్థ రోజూ 120 విమానాల్ని నడిపేది. ఆ తర్వాత ఆ సంఖ్యను రోజుకు 15 కు కుదించింది. ఇప్పుడు పూర్తిగా సర్వీసుల బంద్ దశకు చేరుకుంది.



elephant kills oldaged pilgrim injures two others in poondi reserve forest


ఏనుగు దాడిలో వృద్ధ భక్తుడి మృతి ఇద్దరికి గాయాలు
దైవ దర్శనానికి వచ్చిన 60 ఏళ్ల వృద్ధ భక్తుడు ఏనుగు దాడిలో దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన ఆదివారం పూండి రిజర్వ్ ఫారెస్ట్ కు 30కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఏనుగు దాడిలో మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడకు సమీపంలోని వెలియాన్ గిరిలో కొండపై పురాతన దేవాలయాన్ని సందర్శించుకోవడానికి పలువురు భక్తులు బయలుదేరారు. వీరంతా మార్గమధ్యంలో సెలయారులో నీళ్లు తాగేందుకు ఆగారు. అకస్మాతుగా అడవిలో నుంచి దూసుకువచ్చిన ఏనుగు ఆరుసామి(60) అనే వృద్ధుడ్ని కాళ్లతో తొక్కేసింది. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరిపైన ఏనుగు విరుచుకుపడగా తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరు భక్తులు మాత్రం ఏనుగు దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడినట్లు సమాచారం.


Lover kills woman travels with body in suitcase


ప్రేయసిని చంపి సూట్ కేస్ లో కుక్కిన కిరాతకుడు
నమ్మిన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన కిరాతకుడి ఉదంతమిది. 25 ఏళ్ల యువతి వారం రోజులుగా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. మేడ్చల్ లోని ఓ డ్రెయినేజీ నుంచి యువతి మృతదేహాన్ని శనివారం (ఏప్రిల్13) కనుగొన్నారు. ఇంజినీరింగ్ చేసిన యువతి తన సహ విద్యార్థిని ప్రేమించింది. వీరిద్దరూ 2017 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈనెల 4న ఇద్దరూ ఉద్యోగం కోసం మస్కట్ లో ఇంటర్వ్యూకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ అతను యువతిని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని లాడ్జిలో దించాడు. ఆ తర్వాత రోజు ఆమెను చంపేసి సూట్ కూస్ లో శవాన్ని కుక్కాడు. ఆ సూట్ కేస్ తో కొంత దూరం బస్ లో ప్రయాణించి ఆ తర్వాత క్యాబ్ లో కి మారి మేడ్చల్ ప్రాంతానికి  చేరుకున్నాడు. అక్కడ డ్రెయినేజీలో సూట్ కేస్ ను పారేసినట్లు పోలీసులు వివరించారు. యువతి ఫోన్ కాల్స్ ఆధారంగా హంతకుడి గుట్టురట్టయింది.