Saturday, October 29, 2022

World's 'tallest' Shiva statue unveiled in Rajasthan's Rajsamand

మహాశివయ్య@369

·        రాజస్థాన్ లో విశ్వాస్ స్వరూపం విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాశివుని విగ్రహం రాజస్థాన్ లో కొలువుదీరింది. శనివారం ఈ 369 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొత్ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారీ బాపు, సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పలీవాల్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఉదయ్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల నాథ్ ద్వారలో ధ్యానముద్రలో కూర్చున్న శివయ్య `విశ్వాస్ స్వరూపం`గా భక్తుల్ని అలరిస్తున్నాడు. 2012లో ముఖ్యమంత్రి గెహ్లొత్ ఆధ్వర్యంలోనే ఈ మహా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భారీ శివయ్య విగ్రహం తయారవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. తాట్ పదమ్ సంస్థాన్ ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచీ కనిపిస్తుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు. 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా చెక్కుచెదరనంత పటిష్టంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం చేపట్టారు. విగ్రహం నెలకొల్పిన ప్రదేశం చుట్టూ బంగీ జంప్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి సాహసక్రీడలు, పర్యాటకులు ఆస్వాదించే ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ లను ఏర్పాటు చేశారు.

Friday, October 14, 2022

Rajahmundry road cum railway bridge closed till 21 Oct 2022

కొత్త బ్రిడ్జి మూసివేత

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వారం రోజులపాటు మూసివేశారు. ఈరోజు శుక్రవారం నుంచి మళ్లీ ఈనెల 21 వరకు ఈ బ్రిడ్జిపై రోడ్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయనున్నారు. అత్యవవసర మరమ్మత్తులు చేపట్టడంతో రాజమండ్రి- కొవ్వూరు మధ్య గల ఈ వారధిపై అన్ని ప్రయాణ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 4.1 కిలోమీటర్లు (2.5 మైళ్లు) పొడవైన ఈ బ్రిడ్జిపై  ప్రతి అయిదేళ్లకోసారి రోడ్డు భవనాల శాఖ విధిగా మరమ్మత్తులు చేపడుతోంది. దాంతో ఈసారి కూడా అన్ని ప్రయాణ వాహనాలు; చిన్న, మధ్యతరహా రవాణా వాహనాల ట్రాఫిక్ ను ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక భారీ రవాణా వాహనాలైన లారీలు, ట్రక్కులు మొదలైన వాటిని దివాన్ చెరువు జంక్షన్ రహదారిని కలుపుతూ నిర్మించిన నాల్గో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు. 1974 నుంచి గోదావరి నదిపై అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ కం రైల్వే వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరమైన రాజమండ్రి, వాణిజ్య పట్టణం కొవ్వూరుల మధ్య రాకపోకలకు అనువుగా మారింది.