విశాఖపట్నం-విజయనగరం హైవే
రక్తమోడింది. విజయనగరం జిల్లా సుంకరపేట వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత
పడ్డారు. గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ
బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలండర్ల లారీ, ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అదే సమయంలో విశాఖపట్నం
నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు
ప్రమాదానికి గురైన బస్సును ఢీకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే డంపింగ్
యార్డ్ ఉండడం.. తెల్లవారుజామున అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో విపరీతంగా వెలువడిన పొగ కారణంగా డ్రైవర్లకు
రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దాంతో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి
ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హటాహుటిని దుర్ఘటనా స్థలానికి
చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరు
పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Monday, March 29, 2021
Bus accident near Visakhapatnam five passengers dead 30 injured
Friday, March 26, 2021
President Ramnath Kovind visits army hospital after experiencing chest discomfort
ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి
స్వల్ప అస్వస్థత కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. ఈమేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలోనే రామ్‌నాథ్ కోవింద్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మార్చి 8న ప్రథమ మహిళ ఆయన సతీమణి సవితా కోవింద్ కు టీకా వేశారు.
Monday, March 22, 2021
Telangana CM KCR announced PRC 30% for govt. employees in assembly
తెలంగాణలో పీఆర్సీ పండుగ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్ దారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం ముందు హామీ ఇచ్చినట్లుగానే మున్నెన్నడు లేని రీతిలో ఫిట్మెంట్ ను 30 శాతం పెంచారు. అదే విధంగా ఉద్యోగ విరమణ వయోపరిమితిని 3 ఏళ్లకు పెంచుతూ 61ఏళ్లుగా నిర్ణయించారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఓయూ విద్యార్థులు మాత్రం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ సర్కార్ ను డిమాండ్ చేశారు.
Saturday, March 20, 2021
Uber announces free ride chance for covid-19 vaccination
ఉబెర్ ఆఫర్
ప్రముఖ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు తనవంతు సాయం ప్రకటించింది. టీకా వేయించుకునే వారికి ఉచితంగానే క్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఉచిత రైడ్ ఆఫర్ పొందొచ్చు. రూ.10 కోట్ల విలువైన ఉచిత రైడ్స్ ప్రజలకు అందించదలచింది. అయితే పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. ఇందులో రూ.50 లక్షల వరకు వయోవృద్ధులకు కేటాయించామని సంస్థ తెలిపింది. కరోనా టీకా బృహత్తర కార్యక్రమంలో ఉబెర్ ప్రభుత్వాలతో కలిసి పనిచేయనుంది.
Tuesday, March 16, 2021
Andhra Pradesh CID Notices To Chandrababu Naidu In Amaravati Lands Scam
చంద్రబాబుకు ఏపీ సీఐడీ
నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి సీఐడీ పోలీసులు
విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేశారు. రాజధాని భూముల ధారాదత్తంపై
ఫిబ్రవరి 24నే చంద్రబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి
విచారణ చేపట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్
జరిగిందంటూ గత ఆరు నెలలుగా వై.ఎస్.ఆర్.సి.పి సర్కారు పలు విచారణలు చేపట్టిన సంగతి
తెలిసిందే. తాజాగా 500 ఎకరాల అసెన్డ్ భూముల విక్రయాలపై చంద్రబాబుకు ఈ
నోటీసులు అందాయి. మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసు బృందాలు హైదరాబాద్ బంజారాహిల్స్
లోని ఆయన నివాసానికి చేరుకుని విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.
చంద్రబాబుకు వారం రోజుల గడువిస్తూ ఈనెల 23న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా
నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ సి.ఆర్.పి.సి కింద ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుని అందుకుని చంద్రబాబు
సంతకం చేశారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను నిర్వహించిన మాజీ మంత్రి
నారాయణను కూడా ఈనెల 22న విచారణకు
హాజరుకావాల్సిందిగా సీఐడీ పోలీసులు నోటీసు అందించారు. అసెన్డ్ భూముల్ని క్రయవిక్రయాలు
జరపడం, ప్రత్యేక జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడంపై
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఐడీ
పోలీసులు ఈ మేరకు చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ,ఎస్టీ కేసు ఫైల్ చేసి ఈ నోటీసులు ఇచ్చారు. వీరు విచారణకు హాజరుకానట్లయితే
అరెస్టు చేయాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు
న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
Friday, March 12, 2021
Mumbai based business man signs pact with TTD to donate Rs 300 crore for hospital
టీటీడీకి ముంబయి వ్యాపారవేత్త రూ.300 కోట్ల భారీ విరాళం
తిరుమల వెంకన్న పట్ల ఓ ముంబయి వ్యాపారవేత్త అచంచల భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నాడు. తిరుపతిలో నిర్మించతలపెట్టిన చిన్న పిల్లల ఆసుపత్రికి ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. సంజయ్ సింగ్ అనే ఆ భక్తుడు తన ఫౌండేషన్ ద్వారా యావత్ ఆసుపత్రి నిర్మాణ ఖర్చుని భరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాకు వివరాలు అందించారు. కిమ్స్ ఆవరణలో 300 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని గత ఏడాది టీటీడీ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల బోర్డు సమావేశంలో నూతన హాస్పిటల్ నిర్మాణం గురించి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. మొత్తం ఆసుపత్రి వ్యయాన్ని భరించేందుకు సంజయ్ సింగ్ ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Tuesday, March 9, 2021
Andhra Pradesh government allows beneficiaries to get Corona vaccine without registration
ఏపీలో కరోనా టీకా ఈజీగా..
ముందస్తుగా రిజిస్ట్రేషన్
చేయించుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఎంచక్కా కరోనా టీకా తీసుకోవచ్చు. ఈ మేరకు
రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు జస్ట్
తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు. అదేవిధంగా ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో
ఏదో ఒక జబ్బు ఉన్నట్లు టెస్టుల రిపోర్టులు, డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు చూపిస్తే టీకా వేస్తారు. చూపించిన ఆధారాలతో
అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ
సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా
కొనసాగుతోంది. తొలి విడత వైద్య సిబ్బందికి, రెండో విడతలో పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన
వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన
వారికి ప్రభుత్వ, ప్రైవేట్
ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్
యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ పై
అవగాహన లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే అర్హులకు మంగళవారం నుంచి ప్రభుత్వం చాలా సులభంగా అందిస్తోంది.
Thursday, March 4, 2021
Tunnels to link PM, VP homes to new Parliament building
ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలకు
పార్లమెంట్ నుంచి సొరంగ
మార్గం
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని నివాసంతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం, ఎంపీ చాంబర్స్‌కు సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. రూ.971 కోట్ల వ్యయంతో అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబరు 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు రోడ్డు మార్గంలో పార్లమెంట్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొరంగం మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుపై ప్రధాని కాన్వాయ్ వెళ్తే భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్‌ను నిలిపివేయాలి. కొత్త పార్లమెంట్ భవనం ఈ సమస్యలకు తెరదించనుంది. అయితే రాష్ట్రపతి ఇంటికి మాత్రం సొరంగ మార్గాన్ని నిర్మించడం లేదు. రాష్ట్రపతి పార్లమెంట్‌కు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఎంపీలు ఏడాదిలో మూడు దఫాలు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు జరిగే రోజులన్నీ పార్లమెంట్‌కు రావాలి. అందువల్ల ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ఎంపీ చాంబర్స్‌కు సొరంగం మార్గం ఏర్పాటు చేస్తున్నారు. గోల్ఫ్ కార్ట్‌లోనే సొరంగ మార్గం గుండా నేతలు పార్లమెంట్‌కు వెళ్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సౌత్ బ్లాక్ వైపు ప్రధాని నివాసం, ప్రధానమంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసం రూపుదిద్దుకుంటోంది.