రిషికపూర్ మృతికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం
నటుడు, నిర్మాత, దర్శకుడిగా రాణించి హిందీ చలనచిత్ర పరిశ్రమను ఏలిన రిషికపూర్(67) మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ దిగ్గజం రణబీర్ రాజ్ కపూర్ ద్వితీయ పుత్రుడైన రిషి 2018 నుంచి కేన్సర్ తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. గతంలో ఆయన న్యూయార్క్ లో చికిత్స తీసుకొని భారత్ వచ్చారు. ఇటీవల వ్యాధి మళ్లీ ముదరడంతో ముంబయిలోని ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందారు. 'మేరా నామ్ జోకర్' సినిమా ద్వారా బాలనటుడిగా రిషి తెరంగేట్రం చేశారు. 1974 లో ఆయన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మెప్పించారు. దాంతోపాటు `ది బాడీ` అనే మూవీలోనూ, ఓ వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటించారు. తండ్రి పేరునే కొడుకుకు (రణబీర్ కపూర్) రిషికపూర్ పెట్టుకున్నారు. ఓ లెజెండ్ తరలిపోయారని టాలీవుడ్ ప్రముఖ వెటరన్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కోలివుడ్ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు రిషికపూర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. రిషి మరణవార్తను బిగ్ బీ అమితాబ్ ట్విటర్ వేదికగా తొలుత ధ్రువీకరించారు. ఆలిండియా సూపర్ స్టార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ తో మరణించిన రోజు వ్యవధిలోనే మరో అగ్రనటుడు రిషి అదే వ్యాధి తోనే కన్నుమూయడంతో బాలీవుడ్ తీవ్ర శోకంలో మునిగిపోయింది.