Friday, July 26, 2019

Rahul priyanka pay tribute to kargil war heroes


కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన రాహుల్ ప్రియాంక
20వ విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ లో పాకిస్థాన్ చొరబాటుదారులపై భారత్ సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై26న విజయ దివస్ ను ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలోఅసువులు బాసిన వీర జవాన్లకు రాహుల్, ప్రియాంక శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు ఆ వీర జవాన్లని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టిన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అదే విధంగా దేశ రక్షణలో నిరంతరం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మహిళా, పురుష జవాన్లకు వందనాలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
చొరబాటుదారుల పీచమణచిన భారత సైన్యం
సైన్యం నాటి విజయ క్షణాల్ని స్మరించుకుంటూ నూతనోత్తేజంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు `విజయ్ దివస్` ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. 1999 జులై 26 న కార్గిల్ లో చిట్టచివరి చోరబాటుదారుణ్ని మట్టుబెట్టాక భారత సైన్యం విజయగర్వంతో జాతీయ పతాకను కార్గిల్ లో ఎగురవేసింది. మే 3న పాక్ ముష్కరుల చొరబాటును గుర్తించిన దగ్గర నుంచి జులై 26 వరకు `ఆపరేషన్ విజయ్` చేపట్టిన భారత్ సైన్యం (వైమానిక దళం ప్రధాన భూమిక పోషించింది) ఎడతెగని పోరాటం చేసి కార్గిల్ భూభాగాన్ని కాపాడింది. `టోలింగ్` శిఖరాన్ని రాజ్ పుతానా రైఫిల్స్-2 స్వాధీనం చేసుకోగా, జమ్ముకశ్మీర్ రైఫిల్స్-13 `పాయింట్ 4875(బాత్రా టాప్)`ను భారత్ వశం చేసింది. `ఖలుబార్` శిఖరాన్ని 1/9  గూర్ఖా రైఫిల్స్ స్వాధీనం చేసుకుని జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. అదేవిధంగా టైగర్ హిల్, జుబర్, కుకర్ థాంగ్ శిఖరాలపై ఐఏఎఫ్ యుద్ధ విమానాలు మిగ్-21 మిగ్-27 మిరాజ్- 2000లు లేజర్ గైడెడ్ బాంబుల్ని ప్రయోగించి పాక్ చొరబాటుదారుల బంకర్లను భస్మీపటలం చేశాయి.

No comments:

Post a Comment