పుణెలో
అపార్ట్ మెంట్ గోడ కూలి 15 మంది దుర్మరణం
మహారాష్ట్ర లోని పుణెలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. కొంద్వా ప్రాంతంలో శనివారం ఓ బహుళ అంతస్తుల నివాస భవన సముదాయం
సరిహద్దు గోడ కూలిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. మహిళలు, పిల్లలు ఎక్కువ
మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చనిపోయిన వారంతా కూలీలని
తెలుస్తోంది. భవనం ప్రహరీ సమీపంలో వేరే భవన నిర్మాణ పనులు ఇటీవల చేపట్టారు. అల్కాన్
స్టయిలిస్ అనే ఈ బహుళ అంతస్తుల భవనానికి చెందిన సరిహద్దు గోడ కింద కూలీలు గుడారాలు వేసుకుని ఉంటున్నట్లు తెలిసింది. 20 అడుగుల ప్రహరీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ శిథిలాల కింద
నలిగిపోయిన కూలీలు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన మధ్యరాత్రి 2.30 సమయంలో
చోటు చేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు, జాతీయ విపత్తు నివారణ బృందం (ఎన్డీఆర్ఎఫ్)
రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద కొనప్రాణాలతో
కొట్టామిట్టాడుతున్న ముగ్గుర్ని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
చనిపోయిన కూలీలు బిహార్, బెంగాల్ లకు చెందిన వారిగా పుణె కలెక్టర్ నావల్ కిశోర్
రామ్ తెలిపారు. శనివారం రోజంతా నగరంలో వర్షం కురిసింది. అది కూడా ప్రమాద కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ సంతాపం తెలిపారు. చనిపోయిన ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
మృతుల బంధువులకు సానుభూతిని తెల్పుతూ ట్వీట్ చేశారు. కతిహార్(బిహార్)కు చెందిన
కూలీల దుర్మరణం పట్ల సీఎం నితీశ్ కుమార్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. చనిపోయిన
ఒక్కొక్కరికి రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. అపార్ట్ మంట్ చుట్టుపక్కల జరుగుతున్న
అన్ని నిర్మాణాలు నిలుపుచేయాలని పుణె మేయర్ ముక్తా తిలక్ ఆదేశాలిచ్చారు. ఈ
దుర్ఘటనకు కారకుల్ని విడిచిపెట్టబోమని విపత్తు నివారణ, సహాయక శాఖ మంత్రి
చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ప్రమాద వార్త అందగానే ఆయన ఘటనా స్థలానికి
చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. పుణె కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్
అధికారులు దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment