గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం వై.ఎస్.జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి నేరుగా జగన్ హెలికాఫ్టర్లో గోదావరి ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పోలవరంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే వరద పరిస్థితి కొలిక్కివచ్చే వరకు వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు.