Monday, April 4, 2022

CM Jagan LIVE : AP New Districts Launch

పాలనా నవశకానికి నాంది

* కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం శుభాకాంక్షలు

* ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్ష

పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు వెన్నుదన్నుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో సోమవారం కొత్త జిల్లాల్ని వర్చువల్ గా జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొత్తం 727 జిల్లాలుండగా దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో ఇప్పుడు జిల్లాల సంఖ్య 26కు చేరిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19 లక్షల పైచిలుకుగా ఉండనున్నట్లు సీఎం తెలిపారు. గతంలో ఈ సంఖ్య 38 లక్షలు కావడం వల్ల దేశంలో అత్యంత ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లాలున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.  పొరుగునున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో సగటు జిల్లా జనాభా 10 లక్షలు కాగా కర్ణాటకలో ఆ సగటు 21 లక్షలు, మహారాష్ట్రలో 31 లక్షలని ఆయన వివరించారు. నవరత్నాల పథకాలు సహా పేదల జీవనస్థితిగతుల మెరుగు కోసం అనేక పథకాల అమలుకు శ్రీకారం చుట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నామన్నారు. ఇందుకు ప్రధాన భూమిక జిల్లా కలెక్టర్లదేనని సీఎం చెప్పారు. గతంలో జిల్లా కలెక్టర్లకు అధికారం మాత్రమే ఉండేదంటూ ఆయన ఇప్పుడు వారి భుజాలపై బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. పేదల సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించాల్సిన గురుతర కర్తవ్యంతో జిల్లా ప్రథమ పౌరులుగా కలెక్టర్లు పరిపాలన సాగించాలని సూచించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థ చక్కగా కొనసాగుతోందన్నారు. సుమారు 2.60 లక్షల వాలంటీర్లతో మొత్తం 15505 సచివాలయాలు ప్రజలకు సౌకర్యాలు అందజేస్తున్నాయని సీఎం వివరించారు. రాష్ట్రంలో సుమారు 4.90 కోట్ల జనాభా ఉండగా  ప్రతి అయిదు వందల జనాభాకు ఓ సచివాలయం, ప్రతి 50 మందికి ఓ వాలంటీర్ చొప్పున ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు.

కొత్త జిల్లాలు 26 - రెవెన్యూ డివిజన్లు 72 :

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల: ఆత్మకూరు (కొత్త) డోన్(కొత్త), నంద్యాల

21. అంతపురం: అనంతపురం, కల్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్ఆర్ కడప: బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి

Friday, April 1, 2022

Personal loans up to Rs 50,000 at 7% interest for prisoners in Maharashtra jails

ఖైదీలకు రూ.50 వేల చొప్పున రుణాలు

మహారాష్ట్ర జైళ్లలోని ఖైదీలకు వ్యక్తిగత రుణాలు అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ  వినూత్న కార్యక్రమానికి ఎర్వాడ జైలు శ్రీకారం చుట్టనుంది. తొలుత ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ప్రాజెక్ట్ అమలును బట్టి రాష్ట్రంలోని మిగిలిన జైళ్లలోని ఖైదీలకూ రుణాలు అందనున్నాయి. మహారాష్ట్ర సహకార బ్యాంక్ తో సంప్రదింపులు జరిపిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఒక్కో ఖైదీకి రూ.50 వేల రుణం అందేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎర్వాడ జైలులో 1055 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. రుణం అవసరమైన ప్రతి ఖైదీ ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. ఆయా ఖైదీల శిక్షా కాలం, జైలులో వారు పొందే వేతనం, సంపాదన ఆధారంగా మంజూరయ్యే రుణ మొత్తాన్ని బ్యాంకర్లు నిర్ణయిస్తారు. ఇందుకు 7% వడ్డీ వసూలు చేస్తారు. ఖైదీ విడుదలయ్యే నాటికి బ్యాంకు వద్ద తీసుకున్న రుణం తీరిపోయేలా నిర్ణీత గడువు నిర్ధారిస్తారు.   

Tuesday, March 29, 2022

Tamil Nadu Young man buys dream bike of Rs 2.6 lakh with Rs.1 coins

రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు

తమిళనాడు సేలం జిల్లా అమ్మపేటకు చెందిన ఓ యువకుడు చిల్లర నాణేలతో బైక్ కొని వార్తల్లోకెక్కాడు. భూపతి అనే చిరుద్యోగి రూ.2.60 లక్షలతో బజాజ్ డొమినర్-400 బైక్ కొన్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ 29 ఏళ్ల యువకుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అతనికి బైక్ కొనాలనే ఆశ. మూడేళ్లు క్రితం అతను బజాజ్ షోరూంకు వెళ్లి బైక్ రేటు గురించి కనుక్కున్నాడు. అప్పటి నుంచి రూపాయి నాణేలను కూడబెట్టాడు. ఆ నాణేలన్నింటిని బస్తాల్లో కట్టి బజాజ్ షోరూంకు ట్రాలీలో తీసుకొచ్చాడు. తొలుత అంగీకరించని షోరూం సిబ్బంది భూపతి బ్రతిమలాడ్డంతో తర్వాత ఒప్పుకున్నారు. నాణేలు లెక్కించడానికి అతని స్నేహితులతో పాటు సిబ్బంది 10 గంటల పాటు శ్రమించారు. లెక్క సరిపోయాక బిల్లు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసిన సిబ్బంది అతనికి బైక్ ఇచ్చి పంపించారు. దాంతో హైఎండ్ బజాజ్ బైక్ పై భూపతి కేరింతలు కొడుతూ ఇంటికి చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసిన అతను స్నేహితులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

Monday, March 28, 2022

Telangana CM KCR attended inauguration ceremony of reconstructed Yadadri temple

నవ వైకుంఠం యాదాద్రి

తెలంగాణ తిరుమలగా భక్త జనకోటిని అలరించనున్న యాదాద్రి ఆలయం పున:ప్రారంభమయింది. లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం అందరికీ ఈ సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. నవ వైకుంఠంగా భాసిల్లుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు దర్శన భాగ్య క్రతువులు సోమవారం పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలు షురూ అయ్యాయి. ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు మొదలయ్యాయి. ఈ ఉదయం సీఎం దంపతులు, అసెంబ్లీ, మండలి సభాపతులైన స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్టామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టిన శోభాయాత్రలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి మాడ వీధుల్లో వైభవోపేతంగా స్వామి వారి ఉత్సవ మూర్తుల్ని ఊరేగించారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు, ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశిన ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం అయింది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభాన్ని దర్శించారు. తర్వాత గర్భాలయంలోని మూలవరుల దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని తొలి పూజలు చేశారు. మరోవైపు నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్‌తో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాదానికి దీక్షాపరుల మండపాలన్నింటిని భక్తుల కోసం సిద్ధం చేశారు.