నవ వైకుంఠం యాదాద్రి
తెలంగాణ తిరుమలగా భక్త జనకోటిని అలరించనున్న యాదాద్రి ఆలయం పున:ప్రారంభమయింది. లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం అందరికీ ఈ సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. నవ వైకుంఠంగా భాసిల్లుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు దర్శన భాగ్య క్రతువులు సోమవారం పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలు షురూ అయ్యాయి. ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు మొదలయ్యాయి. ఈ ఉదయం సీఎం దంపతులు, అసెంబ్లీ, మండలి సభాపతులైన స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్టామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టిన శోభాయాత్రలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి మాడ వీధుల్లో వైభవోపేతంగా స్వామి వారి ఉత్సవ మూర్తుల్ని ఊరేగించారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు, ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశిన ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం అయింది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభాన్ని దర్శించారు. తర్వాత గర్భాలయంలోని మూలవరుల దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని తొలి పూజలు చేశారు. మరోవైపు నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్తో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాదానికి దీక్షాపరుల మండపాలన్నింటిని భక్తుల కోసం సిద్ధం చేశారు.