చంద్రబాబుపై మళ్లీ రెచ్చిపోయిన మంత్రి కొడాలి
బూతుల మంత్రిగా, ఆవేశపరుడిగా ప్రతిపక్షాలు పేర్కొంటున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మాజీ బాస్ చంద్రబాబుపై మళ్లీ నోరుపారేసుకున్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తిట్ల దండకం అందుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ, నకిలీ మద్యం ఏరులై పారుతోందంటూ తెలుగుదేశం శాసనసభ్యులు తాజాగా ఈరోజు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. చిడతలు కొడుతూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చర్య పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు ఎమ్మెల్యేలేనా? అసెంబ్లీ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు.. ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో మీ చేష్టలన్నింటిని చూస్తున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ దశలో మంత్రి కొడాలి జోక్యం చేసుకుంటూ చంద్రబాబుపై యథావిధిగా మాటల దాడి చేశారు. సన్నాసి, వెదవ అంటూ తిట్ల వర్షం కురిపించారు. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారుణవాహిని అని పేరు పెట్టి అందరికీ సారాను అందుబాటులోకి తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. చంద్రబాబు `చీప్` మినిస్టరని.. చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కొడాలి ఎద్దేవా చేశారు.