Wednesday, January 12, 2022

Actor Siddharth apologies to Saina Nehwal for 'rude joke'

సైనాను క్షమాపణలు కోరిన సిద్ధార్థ్

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ను దక్షిణాది సినీ హీరో సిద్ధార్థ్ క్షమాపణ వేడుకున్నారు. ఇటీవల తను చేసిన రీ ట్వీట్ కు సంబంధించి ఆయన సారీ చెప్పారు. ఈనెల 5న భారత ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సైనా ట్వీట్ చేశారు. స్పందించి సిద్ధార్థ్ చేసిన రీ ట్వీట్ దుమారం రేపింది. దేశవ్యాప్తంగా నెటిజెన్లు సిద్ధార్థ్ కు స్త్రీద్వేషిగా ముద్ర వేసి  ట్రోలింగ్ కు దిగారు. దాంతో దిగవచ్చిన ఈ హీరో సైనాను క్షమించాల్సిందిగా కోరుతూ మంగళవారం రాత్రి మరో ట్వీట్ చేశారు. తను నిజానికి గొప్ప మహిళావాదినని పేర్కొన్నారు. సైనా అభిప్రాయాలు చాలా వాటితో తను విభేదిస్తానని చెప్పారు. అయినా ఆమె తన చాంపియన్ అన్నారు. తన రీట్వీట్ లో ఉపయోగించిన పదాలు బాగాలేదన్నారు. హాస్యం కోసం తను ప్రయోగించిన భాష చక్కగా లేకపోయి ఉండొచ్చని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ఆ రీ ట్వీట్  తప్పేనని ఒప్పకున్నారు. అందుకే ఈ మొరటు హాస్యానికి గాను సైనా తనను మన్నించాలని కోరారు.

Friday, January 7, 2022

Chandrababu road show in Own constituency Kuppam

కుప్పంలో చంద్రబాబు విస్తృత పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన కుప్పం విచ్చేశారు. ఇటీవల ఆయన తరచు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి గ్రామగ్రామాన ప్రజల సాధకబాధలను తెలుసుకునేందుకే బాబు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చంద్రబాబు 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తే ఓటమి పాలు కావడం ఖాయమని వైఎస్ ఆర్ సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీని సైతం పాలకపక్షానికి టీడీపీ కోల్పోవడం ఆ పార్టీని కుంగదీసింది. మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయంలో తన పంతం నెగ్గించుకున్నట్లు పాలక వర్గాలు కాలరేగరేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తనపట్టు చెక్కుచెదరలేదని పార్టీ శ్రేణులకు సైతం స్పష్టం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కుప్పం తాజా పర్యటన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమ అధినేతకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అదే ఉత్సాహంలో ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ పర్యటనకు వచ్చినట్లు బాబు స్వయంగా వెల్లడించారు. మూడ్రోజుల పాటు (శనివారం వరకు) నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. తను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని పాలకపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే ప్రతిదెబ్బ తనకు తగిలినట్లుగానే భావిస్తానని పేర్కొన్నారు. 

Friday, December 31, 2021

Vijayawada 32 book exhibition starts tomorrow

విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం షురూ

ఆంధప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా ఏటా ఏర్పాటవుతున్న పుస్తకమహోత్సవం విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమవుతోంది. విజయవాడలో మూడు దశాబ్దాలుగా పుస్తక ప్రియుల్ని అలరిస్తోన్న ఈ పుస్తకాల పండుగ 32వది. పుస్తకప్రదర్శన 11 రోజుల పాటు లక్షల సంఖ్యలో పుస్తకప్రియులకు అందుబాటులో ఉండనుంది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల్ని అత్యంత కఠినంగా పాటించనున్నట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. 


Saturday, December 25, 2021

Telangana KTR lashes out BJP body shaming son

తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్న నెటిజన్లు

అందరివాడుగా మన్ననలు అందుకున్న తీన్మార్ మల్లన్న ఒక్క ప్రోగ్రామ్ తో బదనాం అయిపోయాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖామంత్రి కె.టి.ఆర్ తనయుడు హిమాన్ష్ పై మల్లన్న సరదాగా చేసిన కార్యక్రమం అతని కొంపముంచేసింది. కుటుంబసభ్యుల్ని అందులోనూ ఓ స్కూల్ విద్యార్థి అయిన తన కుమారుడి పట్ల మల్లన్న చేసిన కామెంట్ హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గపు పోకడలకు సోషల్ మీడియా స్వర్గంగా తయారయిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు నెటిజన్లు మూక్కుమ్మడిగా తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్నారు. వై.ఎస్.ఆర్.టి.పి. అధ్యక్షురాలు షర్మిల కూడా మల్లన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పబట్టారు. రాజకీయాలు కుటుంబ సభ్యుల వరకు తీసుకురాకూడదని మహిళలు, పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని  కామెంట్లు చేయడం తప్పన్నారు.  కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత సైతం తీన్మార్ మల్లన్న వైఖరిని ఖండించారు. ఏ విషయమూ దొరక్క పిల్లాడిని అతని శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానం చేయడం తగదన్నారు. స్వేరో నేత, బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కూడా మల్లన్న ట్వీట్ ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.