భవినా పతకంతో దేశం గర్విస్తోంది: రాహుల్
టోక్యో పారా ఒలింపిక్స్ లో భవినా బెన్ పటేల్ సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఆదివారం ఆమె టేబుల్ టెన్నిస్ లో రజత పతకాన్ని సాధించారు. పారా ఒలింపిక్స్ లో భారత్ కు లభించిన రెండో పతకమిది. టీటీ క్లాస్-4 విభాగంలో బంగారు పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భవినా చైనా క్రీడాకారిణి యింగ్ జో చేతిలో 0-3తో ఓటమి పాలయ్యారు. అయినా ఆమె సాధించిన విజయం పట్ల దేశం గర్విస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా భవినా సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చారిత్రక విజయంగా ట్విటర్ లో పేర్కొన్నారు.