కరోనా వ్యాక్సినేషన్ లో దేశానికే ఏపీ ఆదర్శం: సీఎం
కోవిడ్ టీకా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యావద్దేశానికే ఆదర్శంగా నిలవనుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన సీఎం జగన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. జగన్ తో పాటు భారతికి కూడా ఈ రోజు తొలిడోసు టీకా వేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ కరోనాను నిలువరించలేమని దానితో సహజీవనం తప్పదని చెప్పారు. అయితే నివారణకు మనదగ్గర ఉన్న ఏకైక అద్భుత అస్త్రం టీకాయేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మనకున్న వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ జాతీయస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీని ముందువరుసలో నిలబెట్టగలవని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు రెండునెలల్లో రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.