Friday, March 26, 2021

President Ramnath Kovind visits army hospital after experiencing chest discomfort

ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాష్ట్రపతి

స్వల్ప అస్వస్థత కారణంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పిగా అనిపించడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు. ఈమేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారు. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలోనే రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. మార్చి 8న ప్రథమ మహిళ ఆయన సతీమణి సవితా కోవింద్‌ కు టీకా వేశారు.

Monday, March 22, 2021

Telangana CM KCR announced PRC 30% for govt. employees in assembly

తెలంగాణలో పీఆర్సీ పండుగ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో పండుగ వాతావరణం నెలకొంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్ దారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎం ముందు హామీ ఇచ్చినట్లుగానే మున్నెన్నడు లేని రీతిలో ఫిట్మెంట్ ను 30 శాతం పెంచారు. అదే విధంగా ఉద్యోగ విరమణ వయోపరిమితిని 3 ఏళ్లకు పెంచుతూ 61ఏళ్లుగా నిర్ణయించారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తింపజేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఓయూ విద్యార్థులు మాత్రం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్ సర్కార్ ను డిమాండ్ చేశారు

Saturday, March 20, 2021

Uber announces free ride chance for covid-19 vaccination

ఉబెర్ ఆఫర్

ప్రముఖ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు తనవంతు సాయం ప్రకటించింది. టీకా వేయించుకునే వారికి ఉచితంగానే క్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఉచిత రైడ్ ఆఫర్ పొందొచ్చు. రూ.10 కోట్ల విలువైన ఉచిత రైడ్స్ ప్రజలకు అందించదలచింది. అయితే పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. ఇందులో రూ.50 లక్షల వరకు వయోవృద్ధులకు కేటాయించామని సంస్థ తెలిపింది. కరోనా టీకా బృహత్తర కార్యక్రమంలో ఉబెర్ ప్రభుత్వాలతో కలిసి పనిచేయనుంది.

Tuesday, March 16, 2021

Andhra Pradesh CID Notices To Chandrababu Naidu In Amaravati Lands Scam

చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి సీఐడీ పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు అందజేశారు. రాజధాని భూముల ధారాదత్తంపై ఫిబ్రవరి 24నే చంద్రబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ గత ఆరు నెలలుగా వై.ఎస్.ఆర్.సి.పి సర్కారు పలు విచారణలు చేపట్టిన సంగతి తెలిసిందే.  తాజాగా 500 ఎకరాల అసెన్డ్ భూముల విక్రయాలపై చంద్రబాబుకు ఈ నోటీసులు అందాయి. మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసు బృందాలు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకుని విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు వారం రోజుల గడువిస్తూ ఈనెల 23న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ సి.ఆర్.పి.సి కింద ఈ నోటీసులు జారీ చేశారు. నోటీసుని అందుకుని చంద్రబాబు సంతకం చేశారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖను నిర్వహించిన మాజీ మంత్రి నారాయణను కూడా ఈనెల 22న విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ పోలీసులు నోటీసు అందించారు. అసెన్డ్ భూముల్ని క్రయవిక్రయాలు జరపడం, ప్రత్యేక జీవో ద్వారా రిజిస్ట్రేషన్లు చేయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సీఐడీ పోలీసులు ఈ మేరకు చంద్రబాబు, నారాయణలపై ఎస్సీ,ఎస్టీ కేసు ఫైల్ చేసి ఈ నోటీసులు ఇచ్చారు. వీరు విచారణకు హాజరుకానట్లయితే అరెస్టు చేయాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.