Tuesday, March 9, 2021

Andhra Pradesh government allows beneficiaries to get Corona vaccine without registration

ఏపీలో కరోనా టీకా ఈజీగా..

ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ఎంచక్కా కరోనా టీకా తీసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు జస్ట్ తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు. అదేవిధంగా ఎంపిక చేసిన 20 దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏదో ఒక జబ్బు ఉన్నట్లు టెస్టుల రిపోర్టులు, డాక్టర్లు ఇచ్చిన మందుల చీటీలు చూపిస్తే టీకా వేస్తారు. చూపించిన ఆధారాలతో అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి వ్యాక్సిన్ ఇచ్చేలా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. తొలి విడత వైద్య సిబ్బందికి, రెండో విడతలో పోలీసులు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ పై అవగాహన లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే అర్హులకు మంగళవారం నుంచి ప్రభుత్వం చాలా సులభంగా అందిస్తోంది.

Thursday, March 4, 2021

Tunnels to link PM, VP homes to new Parliament building

 ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసాలకు

పార్లమెంట్ నుంచి సొరంగ మార్గం

ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం నుంచి ప్రధాని నివాసంతో పాటు ఉపరాష్ట్రపతి నివాసం, ఎంపీ చాంబర్స్‌కు సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ సంస్థ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. రూ.971 కోట్ల వ్యయంతో అన్ని హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో  కొత్త పార్లమెంట్ భవనం నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. గత డిసెంబరు 10న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు రోడ్డు మార్గంలో పార్లమెంట్‌ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొరంగం మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డుపై ప్రధాని కాన్వాయ్ వెళ్తే భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్‌ను నిలిపివేయాలి. కొత్త  పార్లమెంట్ భవనం ఈ సమస్యలకు తెరదించనుంది. అయితే రాష్ట్రపతి ఇంటికి మాత్రం సొరంగ మార్గాన్ని నిర్మించడం లేదు. రాష్ట్రపతి పార్లమెంట్‌కు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని, ఉపరాష్ట్రపతి, ఎంపీలు ఏడాదిలో మూడు దఫాలు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు జరిగే రోజులన్నీ పార్లమెంట్‌కు రావాలి. అందువల్ల ప్రధాని, ఉపరాష్ట్రపతి నివాసంతో పాటు ఎంపీ చాంబర్స్‌కు సొరంగం మార్గం ఏర్పాటు చేస్తున్నారు. గోల్ఫ్ కార్ట్‌లోనే సొరంగ మార్గం గుండా నేతలు పార్లమెంట్‌కు వెళ్తారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా సౌత్ బ్లాక్‌ వైపు ప్రధాని నివాసం, ప్రధానమంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. నార్త్ బ్లాక్ వైపు ఉపరాష్ట్రపతి నివాసం రూపుదిద్దుకుంటోంది.

Saturday, February 27, 2021

TDP chief Chandra Babu completed his tour in kuppam

కుప్పంలో జూ.ఎన్టీఆర్ రావాలని నినాదాలు

చంద్రబాబు సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీ ప్రచారబాధ్యతలు చేపట్టాలనే నినాదాలు మిన్నంటాయి. పంచాయతీ ఎన్నికల అనంతరం సొంత నియోజకవర్గం కుప్పంకు విచ్చేసిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో గడిచిన మూడు రోజులుగా ఆయన విస్తృతంగా పర్యటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూడు నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తానన్నారు. తనకు వీలులేకుంటే లోకేశ్ వచ్చి పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని సూచించారు. పర్యటన అనంతరం శనివారం ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ పయనమయ్యారు.

Wednesday, February 24, 2021

Ghatkesar B-pharmacy student commit suicide

ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని

బలవన్మరణం

తనను కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారనే డ్రామాతో హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్ విద్యార్థిని బుధవారం తుదిశ్వాస విడిచింది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డం యావత్ నగరవాసుల్ని కలచివేసింది. ఆ కేసులో తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తొలుత మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్యం అందించి వైద్యులు ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన యువతి తిరిగి నిన్న రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు యువతి కిడ్నాప్ డ్రామా ఆడి 10 రోజులవుతోంది. పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వైద్యుల సూచనమేరకు ఆమెను మానసిక చికిత్సాలయానికి తరలించారు. కౌన్సిలింగ్ చేసి చికిత్స అందిస్తున్నారు. అంతలోనే మళ్లీ ఆత్మహత్యకు పాల్పడ్డంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.