పీఎస్ఎల్వీ-సీ50 సక్సెస్
పీఎస్ఎల్వీ-సి50 రాకెట్ నింగిలోకి దిగ్విజయంగా దూసుకెళ్లింది. సీఎంఎస్-01 దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ సగర్వంగా మోసుకెళ్లింది. ఇస్రో సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు ఈ శాటిలైట్ ను కక్ష్యలోకి పంపింది. నిర్దేశిత సమయంలోనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకునేలా శాస్త్రవేత్తలు కృషి చేశారు. పీఎస్ఎల్వీ కేటగిరిలో ఇది 52వ ప్రయోగం కాగా ఎక్సెల్ కేటగిరిలో 22వది. 42వ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్ ప్రయోగం. మొత్తంగా ఇస్రోకు ఇది 77వ రాకెట్ ప్రయోగం. 2011లో ప్రయోగించిన జీశాట్-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని ప్లేస్‌లో జీశాట్-12ఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్-01గా మార్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గతంలో జీశాట్-12 ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం సీఎంఎస్-01 శాటిలైట్ 42 వేల 164 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరగనుంది. మొత్తం 1410 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులతో పాటు యావత్ భారత్ దేశంలో కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. ఏడేళ్ల పాటు ఈ ఉపగ్రహం విధులు నిర్వర్తించనుంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు.