నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు అందజేశారు. రోజా బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం ని కలిశారు. భర్త సెల్వమణితో కలసి అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రోజా జగన్ కు స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రోజాను ఆశీర్వదించి మిఠాయి తినిపించారు. అదే విధంగా రోజాకు జగన్ స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఎవరైనా జగన్ వద్దకు వస్తే వారికి ఓ స్వీట్ బాక్స్ కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. అనంతరం రోజా ఈ సాయంత్రం తన కుటుంబసభ్యులతో కలిసి బర్త్ డే వేడుక ఘనంగా జరుపుకున్నారు.
Wednesday, November 18, 2020
Monday, November 16, 2020
Nitish Kumar takes oath as Bihar CM for fourth consecutive time
బిహార్ సీఎంగా నితీశ్ నాల్గోసారి
బిహార్ ముఖ్యమంత్రిగా జెేడీ (యు) చీఫ్ నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయనతో పాటు ఎన్డీయే కూటమిలోని పార్టీల నాయకులు కూడా కేబినెట్ మంత్రులుగా పదవులు చేపట్టారు. డిప్యూటీ సీఎంలుగా తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వి.ఐ.పి) కు చెందిన ముఖేష్ సాహ్ని, జేడీ (యు) విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలౌచౌదరి తదితరులు మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. 2005 నుంచి గరిష్ఠ కాలం బిహార్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టిన సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ)కి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆయనకు సెంట్రల్ బెర్త్ దక్కవచ్చని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ హాజరుకాలేదు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని ఆర్జేడీ బహిష్కరించింది.
Friday, November 13, 2020
Telangana High Court Bans Sale, Use Of Firecrackers Ahead Of Diwali
తెలంగాణలో బాణసంచా నిషేధం
తెలంగాణలో బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించారు. రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. బాణసంచా కాల్చడం వల్ల పెద్దఎత్తున వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శ్వాస కోశవ్యాధుల బారిన పడుతున్నారు. వీటి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, సిక్కింల్లో బాణసంచాపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా దీపావళికి ముందు రాష్ట్రంలో క్రాకర్ల అమ్మకం, వాడకాన్ని గౌరవ హైకోర్టు నిషేధించినట్లు సీనియర్ కౌన్సెల్ మాచార్ల రంగయ్య మీడియాకు తెలిపారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా బాణసంచా కాల్చొద్దని హైకోర్టు సూచించిందన్నారు. ఈ మహమ్మారి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు బలిగొంది. సంక్రమణ ప్రధాన లక్షణంగా గల కరోనా ఊపిరితిత్తుల పైనే అధికప్రభావం చూపుతున్న దృష్ట్యా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అంతేగాక ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి నవంబర్ 19న నివేదికను సమర్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Tuesday, November 10, 2020
Indian Premier League 2020 title winner again Mumbai
ఐపీఎల్ విజేత మళ్లీ ముంబయే!!
ఐపీఎల్ టాప్ క్లాస్ విన్నింగ్ టీమ్ ముంబయి మరో ఫైనల్ విజయాన్ని నమోదు చేసింది. డ్రీమ్ ఏ లెవన్ టోర్నీ తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి మరోసారి ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి ఇది అయిదో ఐపీఎల్ టైటిల్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. గెలుపునకు 157 పరుగులు చేయాల్సిన ఎం.ఐ జట్టు కలిసికట్టుగా ఆడి టైటిల్ ను ముద్దాడింది. మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డీసీని కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఎం.ఐ. జట్టు బ్యాటింగ్ లోనూ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా స్కిపర్ రోహిత్ శర్మ (68) అర్ధ సెంచరీ, ఇషాంత్ కిషన్ అద్భుత బ్యాటింగ్ (19 బంతుల్లో 33 పరుగులు) నైపుణ్యంతో జట్టును తేలిగ్గా విజయతీరానికి చేర్చారు. ఈ మ్యాచ్ తొలి బంతికే స్టోయినెస్ ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. పరుగులేమీ చేయకుండానే స్టోయినెస్ కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత రహానె(2), సూపర్ ఫామ్ లో ఉన్న ధావన్ (15) పరుగులకే వెనుదిరగ్గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యంగ్ టాలెంట్ రిషబ్ పంత్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయ్యర్ 50 బంతుల్లో 65 పరుగులు, రిషబ్ 38 బంతుల్లో 56 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. రిషబ్ కి ఈ టోర్నీలో తొలి అర్ధ సెంచరీ ఇది. వీరిద్దరి జోడి నాల్గో వికెట్ కు 96 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. అయితే చివరి ఓవర్లలో ముంబయి బౌలర్లు బూమ్రా, బోల్ట్, జయంత్, కోల్ట్రెనైల్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ పరుగులకు కళ్లెం వేశారు. బోల్ట్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు, కోల్ట్రెనైల్ 29 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ట్రెంట్ బౌల్ట్ సాధించాడు.మ్యాచ్ తొలిబంతికే అవుటైన స్టోయినెస్ తన బౌలింగ్ లో తొలి బంతికే డీకాక్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. టోర్నీలో చక్కగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. ముంబయి పటిష్ట స్థితిలో ఉండగా లేని పరుగు కోసం యత్నించిన రోహిత్ కోసం సూర్యకుమార్ రనౌట్ గా వెనుదిరిగాడు. తాజా విజయంతో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లయింది.