ఐపీఎల్ విజేత మళ్లీ ముంబయే!!
ఐపీఎల్ టాప్ క్లాస్ విన్నింగ్ టీమ్ ముంబయి మరో ఫైనల్ విజయాన్ని నమోదు చేసింది. డ్రీమ్ ఏ లెవన్ టోర్నీ తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి మరోసారి ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి ఇది అయిదో ఐపీఎల్ టైటిల్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. గెలుపునకు 157 పరుగులు చేయాల్సిన ఎం.ఐ జట్టు కలిసికట్టుగా ఆడి టైటిల్ ను ముద్దాడింది. మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డీసీని కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఎం.ఐ. జట్టు బ్యాటింగ్ లోనూ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా స్కిపర్ రోహిత్ శర్మ (68) అర్ధ సెంచరీ, ఇషాంత్ కిషన్ అద్భుత బ్యాటింగ్ (19 బంతుల్లో 33 పరుగులు) నైపుణ్యంతో జట్టును తేలిగ్గా విజయతీరానికి చేర్చారు. ఈ మ్యాచ్ తొలి బంతికే స్టోయినెస్ ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. పరుగులేమీ చేయకుండానే స్టోయినెస్ కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత రహానె(2), సూపర్ ఫామ్ లో ఉన్న ధావన్ (15) పరుగులకే వెనుదిరగ్గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యంగ్ టాలెంట్ రిషబ్ పంత్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయ్యర్ 50 బంతుల్లో 65 పరుగులు, రిషబ్ 38 బంతుల్లో 56 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. రిషబ్ కి ఈ టోర్నీలో తొలి అర్ధ సెంచరీ ఇది. వీరిద్దరి జోడి నాల్గో వికెట్ కు 96 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. అయితే చివరి ఓవర్లలో ముంబయి బౌలర్లు బూమ్రా, బోల్ట్, జయంత్, కోల్ట్రెనైల్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ పరుగులకు కళ్లెం వేశారు. బోల్ట్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు, కోల్ట్రెనైల్ 29 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ట్రెంట్ బౌల్ట్ సాధించాడు.మ్యాచ్ తొలిబంతికే అవుటైన స్టోయినెస్ తన బౌలింగ్ లో తొలి బంతికే డీకాక్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. టోర్నీలో చక్కగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. ముంబయి పటిష్ట స్థితిలో ఉండగా లేని పరుగు కోసం యత్నించిన రోహిత్ కోసం సూర్యకుమార్ రనౌట్ గా వెనుదిరిగాడు. తాజా విజయంతో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లయింది.