Saturday, September 19, 2020

If you've got a runny nose you DON'T have Covid-19: Expert says

ముక్కు కారుతోందా..అయితే కరోనా లేనట్లే..!

కరోనా భయంతో అనవసర పరీక్షలు చేయిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు బ్రిటన్ వైద్య నిపుణులు ఊరట కల్గించే సంగతి చెప్పారు. ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని అభయం ఇచ్చారు. పిల్లలకు సాధారణంగా ముక్కు కారుతూ ఉంటుంది. సీజనల్ గా వచ్చే జలుబు సాధారణ లక్షణమది. ఆ లక్షణం కల్గి ఉన్న పిల్లలపై చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ జాడ కనిపించలేదు. దాంతో ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. కరోనా సోకిన వారి ముక్కు దిబ్బడ వేసినట్లు ఉంటుందన్నారు. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే పలువురు పిల్లలు జలుబుతో బాధపడుతున్నారు. వారిలో చాలామంది పిల్లలకు ముక్కు కారుతూండడంతో వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురై అనవసరంగా టెస్టుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో  బ్రిటన్  ప్రభుత్వం తరఫున వైద్య రంగ నిపుణులు రంగంలోకి దిగి ఈ ఊరట నిచ్చే అంశాన్ని వెల్లడించారు. లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ముక్కు కారుతుండడం సాధారణ జలుబుకు సంబంధించిన ఒక కచ్చితమైన సంకేతం అని తేల్చి చెప్పారు. ఇందుకు పలు శాంపిళ్లు, సర్వేలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలో జలుబుతో బాధపడుతున్న పిల్లల కోసం వారి తల్లిదండ్రులు క్రీకింగ్ టెస్ట్ లకు పరిగెడుతుండడంతో గందరగోళం నెలకొంటోందని వైద్య నిపుణుడు మాట్ హాన్కాక్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సింప్టమ్ స్టడీ యాప్‌ను నడుపుతున్న ప్రొఫెసర్ స్పెక్టర్ తన పరిశోధనలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని తెలిపారు. అలసట (55 శాతం), తలనొప్పి (55 శాతం), జ్వరం (49 శాతం) తదితర లక్షణాలు పిల్లల్లో కనిపించినట్లు వివరించారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పెద్దల్లో లక్షణాలు ఇలా ఉన్నాయి. అలసట (87 శాతం), తలనొప్పి (72 శాతం), వాసన కోల్పోవడం (60 శాతం) లక్షణాలు కల్గి ఉన్నట్లు సర్వే వివరాలు వెల్లడించారు. పిల్లలు లేదా పెద్దల్లో జలుబు చేసినప్పుడు ముక్కు కారడం తరచుగా గమనించే విషయమేనని అందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Friday, September 18, 2020

TTD to set up lord Venkateswara temple at Ayodhya Rammandir primses

ప్రతి రాష్ట్రంలో శ్రీవారి కోవెల

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు దేశ, విదేశాల్లో కొలువుదీరి భక్తుల్ని అలరించనున్నాడు. దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల్ని నెలకొల్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయోధ్యలో రామమందిరంతో పాటు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి కోవెలను నిర్మించనున్నారు. అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. ఈ ప్రతిపాదన పట్ల యూపీ ప్రభుత్వం సానుకూలత కనబర్చినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 49 టీటీడీ అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం కాశీ, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణాలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు స్థలాల్ని కేటాయించాయి. స్వామి వారి వైభవం, హైందవ సనాతన ధర్మాల్ని ప్రపంచం నలుమూలలకు విస్తరింజేయాలని టీటీడీ సంకల్పించింది. మనదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించదలిచింది. డుమ్మీ, మజిన్ పరిసరాల్లో జమ్మూ ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఇంజినీరింగ్ అధికారుల బృందం ఆ స్థలాన్ని పరిశీలించడం కూడా పూర్తయింది. దాంతో త్వరలోనే జమ్మూలో శ్రీవారి ఆలయం కొలువుదీరబోతోంది. అదే విధంగా ముంబ బాంద్రా ప్రాంతంలో రూ.30కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఆలయ నిర్మాణానికి 650 గజాల స్థలాన్ని మహారాష్ట్ర సర్కారు కేటాయించింది. అదే క్రమంలో భువనేశ్వర్, వైజాగ్, చెన్నైలలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Thursday, September 17, 2020

Charles Chuk Feeney..The San Francisco business man donated 58 thousand crore rupees


 అపర దాన కర్ణ.. ఫీని

§  రూ.58వేల కోట్ల దానం

అపరదాన కర్ణుల జాబితాలోకి తాజాగా అమెరికా వ్యాపారవేత్త ఒకరు చేరారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్బెర్క్ షైర్ హాథ్వే చైర్మన్ వారెన్‌ బఫెట్‌ సరసన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కర్ణుడి పేరు ఛార్ల్స్ చక్‌ ఫీనీ. విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపర్స్‌సహవ్యవస్థాపకుడు. రూ.58వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) అధినేత. ఎంత సంపాదించామన్నది కాదు ఎంత దానం చేశామన్నదే ముఖ్యమంటారీయన. సంతృప్తి అనేది డబ్బు సంపాదనలో కాక దాన్ని పదుగురికి పంచడంలోనే ఉందనేది ఆయన ఫిలాసఫీ.  దాతృత్వంలోనే ఆనందాన్ని వెతుక్కున్న ధీశాలి. బిల్ గేట్స్బఫెట్‌ బాటలో.. కాదు..కాదు.. వారికే మార్గం చూపిన మహామనిషి.. స్ఫూర్తి ప్రదాత ఫీని. తన స్వచ్ఛంద సంస్థ అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌ద్వారా యావదాస్తిని దానం చేశారు. ఫీని తన ఆస్తిని విద్య, సాంకేతికరంగం, ఆరోగ్యం, మానవ హక్కుల రక్షణ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, బెర్ముడా, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ ల్లో  వివిధ స్వచ్ఛంద సంస్థలకు అందజేయడం ద్వారా ఖర్చు చేశారు. ఈ మేరకు 2012లో ప్రకటించిన ఫీనీ, ఆ మాటను ఇప్పుడు నిలుపుకున్నారు. పదవీ విరమణ చేశాక కేవలం రూ.14కోట్లనే ఉంచుకుని తన భార్యతో కలిసి జీవిస్తున్నారు. ఓ సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. శానిఫ్రాన్సిస్కోలోని ఓ మామూలు అపార్ట్ మెంట్ ప్రస్తుతం ఈ దంపతుల ఆవాసం. దాదాపు రూ.58 వేల కోట్ల మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. దాంతో ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది. 1997లో ఆయన అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్ ను ప్రారంభించారు. `జీవిత పరమార్థం గురించి చాలా నేర్చుకున్నా.. చాలా సంతోషంగా ఉంది.. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు బాగా అనిపిస్తోంది` అని ఫీని ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు. బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ఇద్దరూ తమ దాతృత్వాన్ని చాటుకోవడం గురించి చెబుతూ మేము సంపాదించిన అపార సంపదను దానం చేసేందుకు ఫీని మాకు ఓ దారిని ఏర్పరిచాడన్నారు. `మన ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలి`.. అంటూ ఫీని నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు.

Monday, September 14, 2020

 

China spy Indian PM, President and CJI and around 10 thousand other Prominent persons

చైనా వెన్నులో భారత్ వణుకు

పొరుగుదేశంలో డ్రాగన్ గూఢ`చౌర్యం`

భారత్ అంటే చైనా జడుస్తోందా..? అందుకే దాదాపు 10 వేల మంది కీలక వ్యక్తులపై గూఢచర్యానికి పాల్పడుతోందా..? 1962 నాటి పరిస్థితులు కాదని.. భారత్ ఇప్పుడు ఎంతో శక్తిమంతమైన దేశమని చైనాకు బాగా బోధపడినట్లుంది. దాంతో  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, కేంద్రమంత్రులు సహా వేల మంది ప్రముఖులపై  స్పైయింగ్ కు పాల్పడుతోన్నట్లు సమాచారం. వీరిలో భారత రక్షణ రంగానికి చెందిన కీలక వ్యక్తులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి డిజిటల్ జీవితాలపై చైనా కంపెనీలు కన్నేసి ఉంచాయి. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు, మద్దతుదారుల కార్యకలాపాల పైనా ఆ కంపెనీలు నిఘా పెట్టాయని నేషనల్ న్యూస్ ఏజెన్సీ తాజా కథనంలో పేర్కొంది. వీరి రియల్ టైం డేటాను చైనా కంపెనీలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. షెంజేన్ అనే సంస్థ ఈ కుట్రకు నేతృత్వం వహిస్తోంది.  షెంజాన్, చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ డేటా స్థావరాన్ని నిర్మించి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆ కథనంలో వివరించింది. భారత్‌ సరిహద్దుల్లో చొరబాట్లకు దిగడంతో పాటు చైనా చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మరో భారీ కుట్రకు తెరలేపింది. గూఢచర్యం నెరిపేందుకు తమ దేశంలోని కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది.  గల్వాన్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ దేశ వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించి చైనాకు గట్టిగా బదులిచ్చింది. దాంతో ఉడికిపోతున్న చైనా ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.